ఫిబ్రవరి 7 నుండి శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రి 125వ జయంతి ఉత్సవాలు
ఫిబ్రవరి 7 నుండి శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రి 125వ జయంతి ఉత్సవాలు
తిరుపతి, ఫిబ్రవరి 05, 2013: తిరుమల శ్రీవారి వైభవాన్ని తెలిపే అన్నమయ్య కీర్తనలపై విశేష పరిశోధనలు చేసి విస్తృత ప్రాచుర్యం కల్పించిన శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రి 125వ జయంతి ఉత్సవాలు ఫిబ్రవరి 7వ తేదీ నుండి ఆరు ప్రాంతాల్లో ఘనంగా జరుగనున్నాయి. తితిదే శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రి వాఙ్మయపీఠం ప్రత్యేకాధికారి ఆచార్య రవ్వా శ్రీహరి పర్యవేక్షణలో ఇందుకోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి.
మొదటి కార్యక్రమంగా ప్రభాకరశాస్త్రి జన్మస్థలమైన కృష్ణా జిల్లాలోని పెదకళ్లేపల్లిలో ఫిబ్రవరి 7వ తేదీన ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. అదేవిధంగా ఫిబ్రవరి 12న హైదరాబాదులో, ఫిబ్రవరి 21న చెన్నై మహానగరంలో, ఫిబ్రవరి 28న కర్ణాటక రాష్ట్రంలోని మైసూరులో, మార్చి 6న తిరుపతి నగరంలో, మార్చి 9వ తేదీన ఢిల్లీ నగరంలో జయంతి ఉత్సవాలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ప్రముఖ పండితులతో సాహితీ సదస్సులు జరుగనున్నాయి.
మార్చి 6వ తేదీన తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో ప్రభాకరశాస్త్రి జయంతి ఉత్సవం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా సాహితీ సదస్సు, తెలుగు పరిశోధక విద్యార్థినీ విద్యార్థులకు ప్రభాకరశాస్త్రి రచనలపై వ్యాసరచన పోటీలు నిర్వహించి ఎంపికైన నలుగురికి నగదు బహుమతులు ప్రదానం చేయనున్నారు.
కాగా శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రి కవిగా, చరిత్ర పరిశోధకుడిగా, శాసన పరిశోధకుడిగా, ప్రాచీనాంధ్ర సంకలన ప్రచురణకర్తగా, సంస్కృత రూపకానువాదకర్తగా, జానపద సాహిత్య ప్రోత్సాహకుడిగా, తొలి తెలుగు పదమైన ‘నాగబు’ను గుర్తించిన పరిశోధకుడిగా, తాళపత్ర గ్రంథ వివరణ రచయితగా, అన్నమయ్య సంకీర్తన సాహిత్యోద్ధారకుడిగా, అన్నమాచార్య ఉత్సవాల ప్రథమ ప్రారంభకుడిగా ప్రసిద్ధి చెందారు. ఎన్నో పురాతన గ్రంథాలను పరిష్కరించి తితిదేకి అందజేశారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.