BALA BALIKALA METLOTSAVAM _ బాలబాలికలకు ఆధ్యాత్మికత అలవరచటానికి తితిదే కృషి
బాలబాలికలకు ఆధ్యాత్మికత అలవరచటానికి తితిదే కృషి
తిరుపతి, నవంబర్-02, 2009: సమాజంలోని నేటి బాలబాలికలకు విలువలు, భక్తి, ఆధ్యాత్మికత అలవరచటానికి తితిదే కృషి చేస్తున్నదని తితిదే చీఫ్ ఇంజనీర్ వి.ఎస్.బి కోటేశ్వరరావు అన్నారు. సోమవారం ఉదయం శ్రీనివాస మంగాపురం వద్దనున్న శ్రీవారి మెట్టు వద్ద ఈ రోజు ఉదయం బాలబాలికల మెట్లోత్సోవ కార్యక్రమంలో ఆయన బాలబాలికలను ఉద్దేశించి ప్రశంగించారు.
ఈ సందర్భంగా ఛీఫ్ ఇంజనీర్ మాట్లాడుతూ సమాజంలో నానాటికి తగ్గిపోతున్న నైతిక విలువలు పెంపొందిస్తూ వారిలో బాల్యథ నుండే భక్తిభావాన్ని, పెద్దల ఎడల గౌరవభావాన్ని, సమాజం వైపు సానుకూల ధృక్పదంను పెంపొందించే దిశగా దాససాహిత్య ప్రాజెక్టు కృషిచేస్తున్నదని కొనియాడారు.
ఈ సందర్భంగా దాససాహిత్య ప్రాజెక్టు ప్రత్యేక అధికారి శ్రీ ఆనందతీర్థ మాట్లాడుతూ కార్తీక మాసంలో పౌర్ణమి రోజున భగవంతున్ని సేవిస్తే ఎంతో పుణ్యఫలం వస్తుందని చెప్పారు. దాససాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ప్రతి ఏటా మెట్లోత్సవం క్రమం తప్పకుండా నిర్వహిస్తామన్నారు. ఈ సోపాన మార్గం ద్వారా తిరుమలకు చేరుకొని స్వామిని దర్శించుకోవడం సుకృతమని ఆయన బాలబాలికలకు ఉద్భోదించారు.అంతేకాకుండా హైందవధర్మ పరిరక్షణకు, దాససాహిత్యవ్యాప్తికి, స్వామి వారి వైభవాన్ని నలుదిశలా చాటడానికి దాససాహిత్యప్రాజెక్టు పాఠశాల స్థాయి నుండే విద్యార్థులను ఎంపికచేసి వారిలో ధార్మికజ్ఞానాన్ని పెంపొందిచడానికి కృషిచేస్తున్నామని తెలిపారు.
పిమ్మట శ్రీవారిమెట్లకు పూజలను నిర్వహించి బాలబాలికల కోలాటాలు, నృత్యాలు, సంకీర్తనలు, చక్కభజనలు నడుమ గోవిందనామ సంకీర్తనలతో తిరుమలకు వెళ్ళడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటకకు చెందిన 2000 మంది చిన్నారులు పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.