బుషికేష్లో సెప్టెంబరు 1 నుండి శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో అధికమాస మహోత్సవాలు
బుషికేష్లో సెప్టెంబరు 1 నుండి శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో అధికమాస మహోత్సవాలు
తిరుపతి, 2012 ఆగస్టు 27: ఋషికేష్‌లోని ఆంధ్రా ఆశ్రమంలో కొలువైన శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో సెప్టెంబర్ 1వ తేదీ నుండి అధికమాస మహోత్సవాలు ఘనంగా నిర్వహించనున్నారు. తితిదే దాససాహిత్య ప్రాజెక్టు అధ్వర్యంలో సెప్టెంబరు 1వ తేదీ నుండి 8వ తేదీ వరకు శతకలషాభిషేకం, పురుషోత్తమ యాగం జరుగనున్నది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ లోని వివిధ జిల్లాల నుండి 50 భజన బృందాలతో దాదాపు 1000 మంది భక్తులు విశ్వశాంతి కోసం ఋషికేష్‌లోని శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో అఖండనామ సంకీర్తనగావిస్తారు.
సెప్టెంబరు 6వ తేదీ నుండి 8వ తేదీ వరకు శ్రీదేవి,భూదేవి సమేత వేంకటేశ్వర స్వామి ఉత్సవర్లకు గంగాజలంతో తిరుమంజనము, సహస్రాకళషాభిషేకం, పురుషోత్తమ యాగం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమము సెప్టెబరు 8వ తేది పూర్ణాహుతితో ముగియనున్నది. ఈ సందర్భంగా ప్రతి రోజు ఉదయం, సాయంత్రం శ్రీమద్భాగవతం ప్రవచనాలు నిర్వహించనున్నారు.
ఆంధ్రప్రదేశ్ :
ఆగస్టు 29వ తేదీన కర్నూలు నగరంలో మూడు చోట్ల కార్యక్రమాలు జరుగనున్నాయి. ఉదయం 5.00 గంటల నుండి ఫోర్టు కర్నూలు ఉత్తరాదిమఠంలో సుప్రభాతం, తోమాల, అర్చన సేవలు నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 12.00 గంటల నుండి 2.00 గంటల వరకు వెంకటరమణ కాలనీలోని శ్రీ వేంకటేశ్వరాలయంలో తిరుమంజనాభిషేకం జరుగనుంది. సాయంత్రం 6.00 గంటల నుండి 8.30 గంటల వరకు వాసవి మహిళా డిగ్రీ కళాశాలలో సంకీర్తన కుసుమావళి కార్యక్రమం నిర్వహించనున్నారు.
ఆగస్టు 30వ తేదీన మంత్రాలయం శ్రీ రాఘవేంద్రస్వామివారి సన్నిధిలో మంత్రాలయం పీఠాధిపతికి పుష్పకైంకర్య సమర్పణ చేయనున్నారు. అనంతరం ఆగస్టు 31వ తేదీన మహబూబ్‌నగర్‌లోని తితిదే కల్యాణమండపంలో సంకీర్తన కుసుమావళి, సామూహిక భజన కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
సెప్టెంబరు 1వ తేది హైదరాబాదు నగరంలో గల లింగంపల్లిలోని ఉత్తరాధిమఠంలో శ్రీదేవి,భూదేవి వేంకటేశ్వరస్వామి ఉత్సవర్లకు ఉదయం పుష్పార్చన, విష్ణుయాగం నిర్వహించనున్నారు. సాయంత్రం 4.00 గంటల నుండి శోభాయాత్ర, శ్రీనివాస సంకీర్తనామాల జరుగనున్నది.
సెప్టెంబరు 2వ తేదీన కర్ణాటక రాష్ట్రంలోని యాద్గిరి ప్రాంతంలోని శ్రీ వేంకటేశ్వర కల్యాణమండపం నందు స్వామివారి ఉత్సర్లకు సుప్రభాతం, తోమాల, తిరుమంజనాభిషేకం నిర్వహించనున్నారు.
సెప్టెంబరు 3వ తేదీన అదిలాబాదు జిల్లాలోని సోన్ వద్ద గోదావరి నదీతీరంలో శ్రీభూ వేంకటేశ్వరస్వామి ఉత్సవర్లకు నదీ జలాలతో అభిషేకం, శోభాయాత్ర, పురుషోత్తమ యాగం, శ్రీనివాస సంకీర్తన మాల నిర్వహించనున్నారు.
ఈ అధికమాసంలో శ్రీవారిని సేవిస్తే 100 రెట్లు ఎక్కువగా ఫలితం సిద్ధిస్తుందని దాససాహిత్య ప్రాజెక్టు ప్రత్యేకాధికారి శ్రీ ఆనందతీర్థా చార్యులు తెలిపారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.