భక్తునికి భగవంతునికి సమన్వయ కర్తే అర్చకుడు- పి.వి.ఆర్‌.కె. ప్రసాద్‌ 

భక్తునికి భగవంతునికి సమన్వయ కర్తే అర్చకుడు- పి.వి.ఆర్‌.కె. ప్రసాద్‌

తిరుపతి, జూన్‌ 18, 2011: భక్తునికి భగవంతునికి మధ్య సమన్వయ కర్తగా వ్యవహరించడమే అర్చకుని ప్రధాన కర్తవ్యమని తితిదే పూర్వ ఇఓ శ్రీ పి.వి.ఆర్‌.కె. ప్రసాద్‌ అన్నారు.
శనివారం నాడు స్థానిక శ్వేత భవనంలో బిసి అర్చకుల తొలివిడత శిక్షణా ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్చకత్వంచేసే వ్యక్తిని దాదాపు భగవత్‌ స్వరూపంగా పరిగణించే సంస్కృతి హైందవ ధర్మానిది అన్నారు. అటువంటి వైశిష్ఠమైన స్థానాన్ని కలిగియున్న అర్చకుడు భగవత్‌సేవను చిత్తశుద్ధితో, క్రమశిక్షణతో నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు.
 
తిరుమలలో భక్తి సాంప్రదాయాన్ని విస్తరింపచేయడంలో శ్రీ వైష్ణవులు ఎంతో విశేష కృషిచేసారన్నారు. అయితే అనంతరం దాదాపు 725 ఏళ్ళపాటు ఇతర మతస్తుల ప్రభావంతో   తిరుమల క్షేత్రంలో భక్తి ప్రచారం కొంత మరుగన పడిందన్నారు. అయితే నేడు తితిదే తిరిగి భక్తి ప్రచారాన్ని ఎటువంటి శిక్షణా తరగతుల ద్వారా విస్తృత ప్రచారం కల్పించడం హర్షణీయమన్నారు. గిరిజనులకు, హరిజనులకు, మత్స్యకారులకు లాగానే అర్చకత్వంలో బిసిలకు కూడా అర్చకత్వంలో ప్రత్యేక శిక్షణలు ఇవ్వడం ముదావహం అన్నారు.
 
ఒకసారి తిరుమల చరిత్ర గమనిస్తే మనకున్న 12 మంది ఆళ్వారులలో 8 మంది బ్రాహ్మణేతరులు కావడం గమనార్హం అన్నారు. వీరందరూ భగవత్‌ తత్వాన్ని ప్రచారం చేసిన మహనీయులే అన్నారు. వారి స్ఫూర్తిగా తీసుకొని అర్చకత్వంలో శిక్షణ పొందిన వారు తమ తమ ప్రాంతాలలో భక్తి శ్రద్ధలతో అర్చకత్వ బాధ్యతలను నిర్వహించి హైందవ ధర్మ వ్యాప్తికి కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
అంతకు పూర్వం తితిదే ఆగమ సలహాదారు డాక్టర్‌ వేదాంతం విష్ణుభట్టాచార్యులు మాట్లాడుతూ భారతీయ సంస్కృతికి ఎంతో విశిష్ఠత ఉన్నదన్నారు. అందుకే దీనిని యజ్ఞభూమి, కర్మ భూమి, శ్రేష్ఠభూమి అని శ్లాగించారన్నారు. భక్తులు నిజంగా ఆర్తితో పిలిస్తే భగవంతుడు వెంటనే స్పందిస్తాడన్నది అక్షర సత్యం అన్నారు. భక్తులకు భగవంతునికి అనుసంధానకర్తగా వ్యవహరించేవాడే అర్చకుడని ఆయన ఉద్ఘాటించాడు.
 
శ్వేత సంచాలకులు డాక్టర్‌ రామకృష్ణ మాట్లాడుతూ అర్చకత్వంలో శిక్షణ పొందిన అర్చకులు రాబోయే తరాలకు మార్గదర్శకం కావాలన్నారు. అనంతరము తొలి విడత బిసి అర్చకులకు అర్చకత్వ శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న విశాఖపట్టణానికి చెందిన 82 మందికి శ్రీ పి.వి.ఆర్‌.కె. ప్రసాద్‌ సర్టిఫికేట్టు, ఆధ్యాత్మిక పుస్తక-ప్రసాదాలను అందించారు. కాగా ఈ తొలి బిసి పూజారుల శిక్షణాతరగతులు జూన్‌ 13 నుండి జూన్‌ 18 వరకు జరిగాయి.
 
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.