భక్తుల భద్రతే లక్ష్యం కావాలి : తితిదే సీవీఎస్‌ఓ శ్రీ జివిజి.అశోక్‌కుమార్‌

భక్తుల భద్రతే లక్ష్యం కావాలి : తితిదే సీవీఎస్‌ఓ శ్రీ జివిజి.అశోక్‌కుమార్‌

తిరుపతి, 2012 జూలై 26: తిరుమల శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తుల భద్రతే లక్ష్యంగా తితిదే నిఘా సిబ్బంది, భద్రతా సిబ్బంది మరియు స్థానిక పోలీసులు పనిచేయాలని తితిదే ముఖ్య నిఘా మరియు భద్రతాధికారి శ్రీ జివిజి.అశోక్‌కుమార్‌ పేర్కొన్నారు. తిరుపతిలోని శ్వేత భవనంలో ఆరో బ్యాచ్‌ నిఘా, భద్రత మరియు పోలీసు సిబ్బందికి మూడు రోజుల పాటు నిర్వహించిన శిక్షణ తరగతులు గురువారం సాయంత్రం ముగిశాయి.

ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సీవీఎస్‌ఓ మాట్లాడుతూ తిరుమలలో భద్రతా సిబ్బంది, స్థానిక పోలీసులు అన్నదమ్ముల్లా కలిసిపోయి విధులు నిర్వహించాలని సూచించారు. భద్రతా వ్యవస్థలోని అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అవగాహన చేసుకుని విధుల్లో ఆచరించాలన్నారు. నేరగాళ్లు ఎప్పటికప్పుడు కొత్త పద్ధతులను అవలంబిస్తున్నారని, వారిని ఎదుర్కొనేందుకు భద్రతా సిబ్బందికి శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. అనంతరం శిక్షణ తరగతుల్లో పాల్గొన్న 43 మంది నిఘా మరియు భద్రత సిబ్బందికి, 11 మంది పోలీసు సిబ్బందికి ధ్రువపత్రాలు అందజేశారు.

ఈ కార్యక్రమంలో తితిదే విజిఓ శ్రీ ఎం.ఎల్‌.మనోహర్‌, ఏవీఎస్‌వోలు శ్రీ మల్లికార్జున్‌,   రిటైర్డ్‌ డీఎస్పీ జి.నారాయణస్వామి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.