భద్రతా సిబ్బంది మరింత బాధ్యతాయుతంగా పనిచేయాలి
భద్రతా సిబ్బంది మరింత బాధ్యతాయుతంగా పనిచేయాలి
తిరుపతి, ఏఫ్రిల్-16, 2009: తిరుమల తిరుపతి దేవస్థానములలో పని చేస్తున్న భద్రతా సిబ్బంది ఎప్పటికప్పుడు తమ విధినిర్వహణలో సరికొత్త మెళుకువలు నేర్చుకుంటూ మరింత బాధ్యతాయుతంగా పనిచేయాలని తితిదే కార్యనిర్వహణాధికారి డా|| కె.వి.రమణాచారి అన్నారు. గురువారం ఉదయం అలిపిరి వద్ద గల భూదేవి యాత్రికుల వసతి సముదాయమునందు తితిదే భద్రతావిభాగం ఏర్పాటుచేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేశారు.
ఈ సందర్భంగా ఇ.ఓ. మాట్లాడుతూ గతనెల 23 నుండి 25వ తేది వరకు శ్వేతలో రాష్ట్ర ప్రభుత్వ ఇంటలిజెన్స్ విభాగం వారిచే ఇచ్చిన శిక్షణ అందరికి ఉపయోగపడినదని, అయితే ఇటువంటి శిక్షణా కార్యక్రమాలు తరచుగా ఏర్పాటు చేయడం ద్వారా సిబ్బందిలో ఆత్మస్తైర్యం పెరగడమేగాక తమ విధి నిర్వహణలో నిత్యం క్రొత్త విషయాలు తెలుసుకొంటూ భక్తులకు మరింతగా మెరుగైన సేవలు అందించాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా ఎన్నికల విధులకు హాజరవుతున్న భద్రతా సిబ్బందికి ఆయన పలు సూచనలు చేశారు.
గత నెలలో శ్వేతలో నిర్వహించిన మూడురోజుల శిక్షణలో మెరుగైన ప్రతిభ కనబరచిన 53 మందికి ఆయన ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో తితిదే ముఖ్యభద్రతాధికారి శ్రీపి.వి.ఎస్.రామకృష్ణ, ఆదనపు ముఖ్య భద్రతాధికారి మేజర్ శివకుమార్‌రెడ్డి, వి.జి.ఓ.సాంబశివారెడ్డి, ఎస్.ఫి.ఎఫ్ డి.ఎస్.పి. శ్రీదేవిదాస్, దాదాపు 1000 మంది సిబ్బంది పాల్గొన్నారు.
అంతకుముందు ఉదయం 9గంటలకు శ్రీనివాసమంగాపురంకు సమీపానగల శ్రీనివాస ఆయుర్వేద పార్మశి నందు రూ.35/- లక్షల రూపాయలతో నిర్మించిన ‘అమృత’ అను పేరు గల నూతన భవనాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన శ్వాసామృత అను నూతన ఔషదాన్ని విడుదల చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లడుతూ ఇక్కడ తయారయ్యే మందులు సశాస్త్రీయంగా తయారవుతున్నాయని, ఇవి జీవనానికి జీవితానికి ఔషదప్రాయమైనవని చెప్పారు. ఇక్కడ తయారుచేస్తున్న మందులు తితిదే ఆయుర్వేద ఆసుపత్రినందు ఉచితంగా లభ్యమౌతున్నాయని, ప్రజలు వీటిని చక్కగా ఉపయోగించుకోవాలని ఆయన కోరారు.
ఈ కార్యక్రమంలో తితిదే ఛీఫ్ ఇంజనీరు శ్రీవి.ఎస్.బి.కోటేశ్వరరావు, డి.ఎప్.ఓ. శ్రీఅశోక్, ఎస్.ఇ లు శ్రీసుధాకర్, శ్రీరామచంద్రారెడ్డి, శ్రీమురళీధర్‌లు, డాక్టర్లు మరియు సిబ్బంది పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.