భద్రతా సిబ్బంది సేవాభావంతో ఉండాలి :  తితిదే సీవీఎస్వో శ్రీ జివిజి.అశోక్‌కుమార్‌

భద్రతా సిబ్బంది సేవాభావంతో ఉండాలి :  తితిదే సీవీఎస్వో శ్రీ జివిజి.అశోక్‌కుమార్‌

తిరుపతి, ఫిబ్రవరి 04, 2013: తిరుమల తిరుపతి దేవస్థానం నిఘా, భద్రతా సిబ్బంది విధి నిర్వహణలో సేవా భావంతో వ్యవహరించాలని ముఖ్య నిఘా మరియు భద్రతాధికారి శ్రీ జివిజి.అశోక్‌ కుమార్‌ సూచించారు. తిరుపతిలోని శ్వేత భవనంలో తితిదే నిఘా, భద్రతా సిబ్బందికి నాలుగు రోజుల పాటు జరుగనున్న శిక్షణ తరగతులు సోమవారం ప్రారంభమయ్యాయి.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సీవీఎస్వో శ్రీ జివిజి.అశోక్‌కుమార్‌ మాట్లాడుతూ భద్రతా సిబ్బంది భక్తులకు సేవ చేసినప్పుడే భగవంతునికి నిజమైన సేవ చేసినట్టు అవుతుందన్నారు. ప్రపంచంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుమలలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా భక్తులకు పూర్తి భద్రత కల్పించాలని కోరారు. భక్తులతో ఎలా మెలగాలి, అనుకోని పరిస్థితులు ఎదురైనప్పుడు ఎలా స్పందించాలి లాంటి అంశాలను ఈ శిక్షణ తరగతుల్లో తెలియజేయనున్నట్టు వివరించారు. సిబ్బంది ఈ తరగతులను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
కాగా రిటైర్డ్‌ డీఎస్పీ శ్రీ నారాయణస్వామి పర్యవేక్షణలో తిరుమల శ్రీవారి ఆలయ చరిత్ర, దేవాదాయ శాఖ చట్టం, తిరుమలలో నిషేధిత పదార్థాలను అరికట్టడం, యోగా, డ్రిల్‌ తదితర అంశాలపై భద్రతా సిబ్బందికి శిక్షణ ఇవ్వనున్నారు.
ఈ కార్యక్రమంలో తితిదే విజిఓ శ్రీ హనుమంతు, ఏవీఎస్‌ఓ శ్రీ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.
   
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.