మార్చి 20 నుండి 26 వరకు నారాయణవనంలో పంగుణోత్తర ఉత్సవం

మార్చి 20 నుండి 26 వరకు నారాయణవనంలో పంగుణోత్తర ఉత్సవం

తిరుపతి, మార్చి 18, 2013: నారాయణవనంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో మార్చి 20 నుండి 26వ తేదీ వరకు పంగుణోత్తర ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నారు.

ఇందులో భాగంగా మార్చి 20 నుండి 25వ తేదీ వరకు ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు జరుగనున్నాయి. ప్రతిరోజూ అమ్మవారిని సుప్రభాతంతో మేల్కొలిపి ఏకాంత తిరుమంజనం నిర్వహిస్తారు. సాయంత్రం 5.00 నుండి 6.00 గంటల వరకు అమ్మవారి ఉత్సవం, ఊంజల్‌సేవ, ఆస్థానం నిర్వహించనున్నారు. మార్చి 26వ తేదీన పంగుణోత్తర ఉత్సవాన్ని పురస్కరించుకుని ఉదయం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం జరుగనుంది. సాయంత్రం 6.00 గంటలకు స్వామి, అమ్మవార్లకు వీధి ఉత్సవం నిర్వహించనున్నారు. అమ్మవారితో శ్రీవారు ఏకాంతంగా గడిపిన రోజును పురస్కరించుకుని ఈ ఉత్సవాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందని అర్చకులు తెలిపారు.

ఈ సందర్భంగా తితిదే అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ప్రతిరోజూ సాయంత్రం భక్తి సంగీత కార్యక్రమం నిర్వహించనున్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.