రథసప్తమి వాహన వైభవం ప్రత్యేకతలు

రథసప్తమి వాహన వైభవం ప్రత్యేకతలు

తిరుమల, 2 ఫిబ్రవరి 2013: సూర్య జయంతిని పురస్కరించుకొని గురువారంనాడు తిరుమలలో నిర్వహించే ”రథసప్తమి” వేడుకలకు తిరుమల గిరులు అందంగా ముస్తాబయ్యింది.
 
మాఘశుద్ధ సప్తమినాడు ప్రతి ఏటా ఈ ఉత్సవాన్ని తిరుమలలో అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ఒకే రోజున శ్రీమలయప్పస్వామివారు సూర్యప్రభ, చిన్నశేష, గరుడ, హనుమ, కల్పవృక్ష, సర్వభూపాల, చంద్రప్రభ వాహనాలపై తిరుమాడ వీధులలో ఊరేగుతూ, భక్తులను అనుగ్రహిస్తాడు. ఈ వాహనాల సేవలతోబాటు మధ్యాహ్నం చక్రస్నానం కూడా శ్రీ సుదర్శన చక్రత్తాళ్వారుకు నిర్వహిస్తారు.
కాగా రథసప్తమి పర్వదినాన్ని తిరుమలలో క్రీ.శ 1564 నుండి జరుపుతున్నట్లుగా శాసనాధారాలు ఉన్నాయి. సూర్యోదయం నుండి చంద్రోదయం వరకు వివిధవాహనాలపై ఊరేగే స్వామివారి కమనీయ రూపాన్ని దర్శించడానికి విచ్చేసే భక్తజన సందోహంతో తిరుమల కోలాహాలంగా ఉంటుంది.
సూర్యప్రభ వాహనం ః- (ఉదయం 5.30 గం||ల నుండి ఉదయం 8.00 గం||ల వరకు) వాహనసేవలో అత్యంత ప్రధానమైన రథసప్తమి వాహనసేవ సూర్యప్రభవాహనం. సర్వలోకాలకు చైతన్యాన్ని కలిగిస్తూ ఉదయించే శ్రీ సూర్య భగవానుడు, తన తొలిఉషారేఖలను అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడైన శ్రీ మలయప్పస్వామిపై ప్రసరించి అంజలి ఘటిస్తాడు. ఈ వాహనసేవ అపురూప దృశ్యాన్ని తిలకించడానికి వేలాది కన్నులు ఉదయాతూర్వం నుండి ఎంతో ఆసక్తితో నిరీక్షిస్తూంటాయి.
చిన్నశేష వాహనం ః- (ఉదయం 9.00 గం||ల నుండి 10.00 గం||ల వరకు) సూర్యప్రభ వాహనంపై శ్రీ సూర్యనారాయణమూర్తి కమనీయ రూపాన్ని తిలకించి పులకించిన భక్తులు అనంతరం స్వామివారి చిద్విలాసాన్ని చిన్నశేష వాహనం తిలకించి తరిస్తారు.
గరుడ వాహనం ః- (ఉదయం 10.00 గం||ల వరకు 12.00 గం||ల వరకు) స్వామివారికి ఎన్ని వాహనసేవలు ఉన్నా తన ప్రియమైన గరుడ వాహనసేవ లేనిదే సంపూర్ణత చేకూరదు. అలంకారప్రియుడైన స్వామివారు సర్వాలంకార భూషితుడై, పుష్పమాలాలంకృతుడై ఛత్రచామర సార్వభౌమిక మర్యాదలతో, పక్షిరాజు గరుడునిపై రాజఠీవితో తిరు వీధులలో విహరిస్తూ భక్తులను కటాక్షిస్తాడు.
హనుమంత వాహనం ః- (మధ్యాహ్నం 1.00 గం|| నుండి మధ్యాహ్నం 2.00 గం||ల వరకు) భక్తులకు నిజమైన భక్తిరసం, శరణాగతి యొక్క నిర్వచనాన్ని తెలియపరచడానికి స్వామివారు భక్తాగ్రేసరుడైన హనుమంతుని వాహనంపై పుణ్యక్షేత్ర మాడ వీధులలో ఊరేగుతాడు.
చక్రస్నానం ః- (మధ్యాహ్నం 2.00 గం||ల నుండి మధ్యాహ్నం 3.00 గం||ల వరకు) శ్రీ మలయప్ప స్వామివారు ఆలయాన్ని ప్రవేశించిన పిదప అర్చకస్వాములు శ్రీ సుదర్శన చక్రస్వామిని ఆలయ మాడవీధులలో ఊరేగిస్తూ వరాహస్వామి ఆలయాన్ని చేరుకుంటారు. అనంతరం అర్చకులు ఆలయ ప్రాంగణంలో చక్రత్తాళ్వారుకు పంచామృతాభిషేక స్నానం చేయించి స్వామి పుష్కరిణిలో ముంచి తీర్థస్నానం చేయిస్తారు.
కల్పవృక్ష వాహనం ః- (సాయంత్రం 4.00 గం||ల నుండి సాయంత్రం 5.00 గం||ల వరకు) సకల కోరికలు ఈడేర్చే దైవ వృక్షం అయిన కల్పవృక్ష వాహనంపై స్వామివారు తన ఉభయదేవేరులతో కూడి తిరువీధులలో ఊరేగుతూ అనుగ్రహిస్తారు.
సర్వభూపాల వాహనం ః- (సాయంత్రం 6.00 గం||ల నుండి సాయంత్రం 7.00 గం||ల వరకు) పురవీధులలో సకల చరాచర జగత్పాలకుడైన స్వామివారు రాజసం ఉట్టి పడుతుండగా, ప్రౌఢ గాంభీర్యంతో సర్వభూపాల వాహనాన్ని అధిరోహించి భక్తులకు అభయహస్తాన్ని అనుగ్రహిస్తాడు.
చంద్రప్రభ వాహనం ః- (రాత్రి 8.00 గం||ల నుండి రాత్రి 9.00 గం||ల వరకు) భానుని నునులేత కిరణాల స్పర్శతో ప్రారంభమైన స్వామివారి సప్త వాహన శోభ వెన్నెల రేడైన చంద్రుని చల్లని చంద్రప్రభ వాహనంపై ఆహ్లాద విహారంతో ముగుస్తుంది.
పిదప స్వామివారు దేవేరులతో కూడి బంగారు పీఠంపై ఆసీనుడై ఆలయ ప్రవేశం చేయడంతో రథసప్తమి వాహన వేడుకలు ఘనంగా పూర్తి అవుతాయి.
ఈ పర్వదినాన స్వామివారు ఒకే రోజున ఏడు ప్రధాన వాహనాలపై ఊరేగిన కారణంగా, ‘రథసప్తమి’ని ఒకరోజు బ్రహ్మోత్సవాలని కూడా వ్యవహరిస్తారు.
 
తి.తి.దే ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.