వివరణ
తిరుపతి, 2010 జూలై 10
తిరుమల తిరుపతి దేవస్థానములు, తిరుపతి.
వివరణ
జూలై 9వ తేదిన ”ఈనాడు” దినపత్రిక నందు ప్రచురించిన ”ప్రముఖ హస్తం!” – రూ.లక్ష దుకాణం… రూ.500లకే -సామాన్యుడి నుంచి కార్పొరేట్ సంస్థ..! – తితిదేలో గోల్‌మాల్! ” అని ప్రచురించిన వార్త నిజం కాదు.
ఎండోమెంట్ చట్టం 30/87, జిఓయం.ఎస్ నెం.311, రూల్ నంబర్ 146 ప్రకారం తితిదే కార్యనిర్వహణాధికారికి షాపులు టెండర్ పద్దతి కాకుండా నామినేషన్ పద్దతిపై ప్రత్యేక పరిస్థితులలో మంజూరు చేసే విచక్షణాధికారం వున్నది. అదేవిధంగా టెండర్ పద్దతి లేదా రెవిన్యూ షేరింగ్ పద్దతిపై షాపులను కేటాయించే పద్దతి చాలా ఏళ్ళుగా టిటిడి తిరుమలలో అమలు చేస్తోంది.
ఈక్రమంలో ప్రముఖ సంస్థలైన నెస్లే, హిందూస్థాన్ లివర్ లిమిటెడ్ వారికి రెవిన్యూ షేరింగ్ పద్దతిపై షాపులు కేటాయించడం జరిగింది. ఈ క్రమంలో 2005 సంవత్సరంలో రాష్ట్ర షెడ్యూల్డు కులాల శాసనసభా కమిటీ వారి సూచనల మేరకు బెనర్జీ అను వ్యక్తికి (షెడ్యూల్డు కులంనకు చెందిన వ్యక్తి) షాపు కేటాయించగా ఆయన కోరిక మేరకు వారి మేనల్లుడైన రోహిణీ కుమార్ (వికలాంగుడు)కు తిరుమలలో నామినేషన్‌పై షాపుకేటాయించడం జరిగింది. అయితే సదరు వ్యక్తి తిరుమలలో సరిగ్గా వ్యాపారం జరగలేదని, శ్రీనివాసంలో తనకు షాపు కేటాయించాలని తితిదేని కోరగా, వారికి నామినేషన్ పద్దతి ద్వారా షాపు కేటాయించడం జరిగింది.
అదేవిధంగా ప్రముఖ కంపెనీలైన కాఫీ డే, అమాల్గమేటడ్‌్ వారికి శ్రీనివాసంలో అడగ్గా అక్కడ కూడా తిరుమల వలె రెవిన్యూ షేరింగ్ ఫార్ములా పద్దతిపై షాపులు కేటాయించాలని నిర్ణయించడం జరిగింది. ఈ మేరకు హిందూస్థాన్ లివర్ లిమిటెడ్, విశాలాక్షి కేఫ్ కాఫీడే, అమాల్గమేటడ్ వారికి షాపులు కేటాయించడానికి అనుమతించగా ఆప్రకారం వారు నియమ నిబంధనలను పూర్తి చేయాల్సివుంది. అంతేగానీ ఈ విషయంలో ఎటువంటి పొరబాట్లు జరగలేదని తెలియజేస్తున్నాం.
కనుక ఈ సమాచారాన్ని రేపటి మీ దినపత్రిక నందు వివరణగా ప్రచురించవలసిందిగా కోరుచున్నాము.
ప్రజాసంబంధాల అధికారి
తిరుమల తిరుపతి దేవస్థానములు, తిరుపతి.