Three-day Youth Festival-“Veda Vidya Yuva Chatra Samaroham 2010” concludes _ వేదవిశ్వ విద్యాలయంలో యువజనోత్సవాల ముగింపు
వేదవిశ్వ విద్యాలయంలో యువజనోత్సవాల ముగింపు
తిరుపతి, 2010 నవంబర్-25,: వేదాలు అనంతమైనవని ఈ వేదాల ద్వారా వచ్చిన సాహిత్యం భారతీయ సంస్కృతికి దర్పణం పడుతోందని నెల్లూరు సింహపురి విశ్వవిద్యాలయం ఉపకులపతి సి.ఆర్.విశ్వేశ్వర రావు పేర్కొన్నారు. తిరుపతిలోని శ్రీవేంకటేశ్వర వేద విశ్వవిద్యాలయంలో గురువారం మూడురోజుల పాటు జరిగిన యువజనోత్సవాల ముగింపు సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.
సాహిత్యం, ఔన్నత్యాన్ని పెంపొందిస్తుందని, ఓదార్పునిస్తుందని, బావిభారత పౌరులుగా తీర్చిదిద్దుతుందని ఆయన విపులీకరించారు. సాహిత్యంలో అనేక పరిణామాలు సంభవిస్తున్నాయని ఈ పరిణామాలు కవి సృజనాత్మకతను తెలియజేస్తాయని వివరించారు. గౌరవ అతిథిగా పాల్గొన్న కృష్ణమండల వేద సభ పరిపోషకులు మాగంటి సుబ్రమణ్యం మాట్లాడుతూ విద్యార్థుల్లో నైపుణ్యాన్ని పెంపొందించడానికి యువజనోత్సవాలు దోహదపడతాయని తెలిపారు. వేద విద్యను పునరుజ్జీవనం చేయడానికి విద్యార్థులకు ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. ప్రాచీన కాలం నుండి యువజనోత్సవాలను నిర్వహించే సంప్రదాయం ఉందని ఆయన పేర్కొన్నారు.
శ్రీవేంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం ఉపకులపతి సన్నిధానం సుదర్శన శర్మ మాట్లాడుతూ సంప్రదాయాలు వేద శాస్త్రాల విజ్ఞానాన్ని పెంపొందించడం అభినందనీయమని పేర్కొన్నారు. ప్రాచీన భారతీయ వేద శాస్త్రాన్ని భవిష్యత్ తరాలకు అందించాల్సిన బాధ్యత నేటి వేద విద్యార్థులపై ఉందన్నారు. వేద విద్యను అభ్యసించాలంటే సంస్కృత భాష పరిజ్ఞానం అవసరమని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా అనంతపురం జిల్లా ఆరవీడు గ్రామానికి చెందిన దత్తాత్రేయ శర్మ తన దగ్గర ఉన్న జ్యోతిష్యం వైద్యశాస్త్రాలకు సంబంధించిన తాళపత్ర గ్రంధాలను ఎస్వీబిసి ఉద్యోగి కౌశిక్ ద్వారా విసి సన్నిదానం సుదర్శన శర్మకు అందజేశారు.
అనంతరం వివిధ పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను ప్రదానం చేశారు. విసి సుదర్శన శర్మ ముఖ్య అతిథి విశ్వేశ్వర రావు, గౌరవ అతిథి మాగంటి సుబ్రమణ్యంలను ఘనంగా సత్కరించారు. ఈ కార్యమ్రంలో రాష్ట్రంలోని పది వేదపాఠశాలల నుండి విద్యార్థులు పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.