METLA PUJA HELD _ వైభవంగా శ్రీవారి మెట్లోత్సవం

TIRUPATI, 27 AUGUST 2022: On the last day of Traimasika Metlotsavam, Metla Puja was held at Alipiri Padala Mandapam during the wee hours on Saturday.

 

Speaking on the occasion, Dasa Sahitya project special officer Sri Ananda Theerthacharyulu said, a Metlotsavam in Brahma Muhurtam will provide good virtues. He said Sri Purandharadasa, Sri Vyasaraja Theertha, Sri Annamacharya, Sri Krishna Devaraya and many other devotees of Sri Venkateswara trekked the Alipiri footpath and attained salvation.

 

Over 3000 troupes of Bhajana Mandalis belonging to different southern states participated in this Metlotsavam.

 

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

వైభవంగా శ్రీవారి మెట్లోత్సవం

అలిపిరి పాదాలమండపం వద్ద ఘనంగా మెట్లపూజ

తిరుపతి, 2022 ఆగ‌స్టు 27: టీటీడీ దాససాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్వంలో శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవం శ‌నివారం తెల్లవారుజామున తిరుపతిలోని అలిపిరి పాదాలమండపం వద్ద వైభవంగా జరిగింది. దాససాహిత్య ప్రాజెక్టు ప్రత్యేకాధికారి శ్రీ పి.ఆర్‌.ఆనందతీర్థాచార్యులు ముందుగా మెట్లపూజ నిర్వహించి మెట్లోత్సవాన్ని ప్రారంభించారు.

ఈ సంద‌ర్భంగా శ్రీ పి.ఆర్‌.ఆనంద‌తీర్థాచార్యులు మాట్లాడుతూ బ్ర‌హ్మముహూర్తంలో కాలినడకన మెట్లను అధిరోహించి తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం ఎంతో పుణ్యఫలమన్నారు. పూర్వం శ్రీ పురందరదాసులు, శ్రీ వ్యాసరాజయతీశ్వరులు, శ్రీమాన్‌ అన్నమాచార్యులు, శ్రీకృష్ణదేవరాయలు లాంటి మహనీయులు భక్తిప్రపత్తులతో తిరుమల కొండలను అధిరోహించి స్వామివారి వైభవాన్ని దశదిశలా వ్యాప్తి చేశారని వివరించారు. అలాంటివారి అడుగుజాడలలో నడిచి ఆ దేవదేవుని కృపకు అందరూ పాత్రులు కావాలనే తలంపుతో టీటీడీ మెట్లోత్సవాన్ని నిర్వహిస్తోందని తెలిపారు.

వివిధ ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో విచ్చేసిన భజన మండళ్ల సభ్యులు సాంప్రదాయ భజనలు చేసుకుంటూ సప్తగిరులను అధిరోహిస్తున్నట్టు చెప్పారు. భజన మండళ్ల సభ్యులకు టీటీడీ మూడో సత్రం ప్రాంగణంలో ధార్మిక శిక్షణ, హరిదాస కీర్తనల్లో అంత్యాక్షరి, దాస సాహిత్యంలో రసప్రశ్నల స్పర్థ, సంగీత విభావరి కార్యక్రమాలు నిర్వహించినట్టు వివరించారు. ఇక్కడ శిక్షణ పొందిన సభ్యులు తమ తమ ప్రాంతాలకు వెళ్లి భక్తజనావళికి సనాతన ధార్మిక అంశాలపై శిక్షణ ఇస్తారని తెలియజేశారు.

అంతకుముందు భజనమండళ్ల భక్తులు టీటీడీ మూడో సత్రం ప్రాంగణం నుండి అలిపిరి శ్రీవారి పాదాల మండపం వద్దకు చేరుకున్నారు. అనంతరం పాదాలమండపం వద్ద సంప్రదాయబద్ధంగా మెట్లపూజ నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ‌, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన 3 వేల‌ మందికిపైగా భ‌జ‌న మండ‌ళ్ళ స‌భ్యులు భజనలు చేసుకుంటూ తిరుమలగిరులను అధిరోహించారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.