శ్రీమాక్ తాళ్ళపాక అన్నమాచార్యుల వారి 508వ వర్ధంతి మహోత్సవాలు
శ్రీమాక్ తాళ్ళపాక అన్నమాచార్యుల వారి 508వ వర్ధంతి మహోత్సవాలు
తిరుపతి, మార్చి-30, 2011: కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వేంకటేశ్వరస్వామి వారిని 32,000 కీర్తనలతో స్తుతించిన శ్రీమాక్ తాళ్ళపాక అన్నమాచార్యుల వారి 508వ వర్థంతి మహోత్సవాలను జరుపుకోబోతున్నాము. సంప్రదాయ బద్ధంగా ఏటేటా అన్నమాచార్య ప్రాజెక్టు తరపున ఈ కార్యక్రమాలను తిరుమల, తిరుపతి తాళ్ళపాక, దేవుని కడప, తిరుచానూరులలో భక్తులందరిన్ని ఉత్తేజపరచుటకు ఈ కార్యక్రమములను నిర్వహిస్తున్నాము. తేది:30-03-2011న ఉదయం 7-00 గంటలకు అలిపిరి వద్ద మెట్లోత్సవముతో ఈ కార్యక్రమములు ప్రారంభమౌతాయి. మూడు రాష్ట్రాల నుండి విద్వాంసులు, భజన బృందాలు 1500 ల మందికి పైగా యీ మెట్లోత్సవములో పాల్గోన్నారు. ఉదయం 7-00 గంటలకు అలిపిరి శ్రీవారి పాదాల మండపము వద్ద భజనలు నిర్వహించి అన్నమయ్య కీర్తనలను పాడుకొంటూ కాలినడకన ఏడు కొండలు ఎక్కుతారు. తిరుమలలో వారికి శ్రీవారి దర్శనం, వసతి, ప్రసాద వినియోగం వంటి ఏర్పాట్లు అన్నియు జరుగుతాయి. 31వతేది ఉదయం 7-00 గంటలకు శ్రీమలయప్పస్వామి శ్రీదేవి, భూదేవి సమేతముగా తిరుమల తిరువీధుల గుండా ఊరేగింపుగా నారాయణవన ఉద్యావనమునకు వేంచేస్తారు. 8-00 గంటలకనుండి 10-00 గంటలకు వరకు నారాయణగిరి ఉద్యానవనములో శ్రీవారి పరిణయోత్సవ వేదిక వద్ద సప్తగిరి సంకీర్తనా గోష్ఠిగానం నిర్వహింపబడుతుంది. ఈ కార్యక్రమాలకు గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ గవర్నరు శ్రీమాన్ ఇ.యస్.యల్. నరసింహన్ గారు విచ్చేస్తారు. ఆహోబిలం మఠం పీఠాధిపతి శ్రీమాన్ శటగోపరంగనాథ మహాదేశికన్ స్వామివారు సపరివారంతో విచ్చేస్తారు. వారి అనుగ్రహ భాషం కూడా వుంటుంది. తాళ్ళపాక వంశీకులకు సన్మానం జరుగుతుంది. ఈ సప్తగిరి సంకీర్తనా గోష్ఠి గానంలో ప్రముఖ విద్వాంసులు పద్మభూషన్ శ్రీ నూకం చినసత్యనారాయణ, కేంద్ర ప్రభుత్వ హంస అవార్డు గ్రహీత అన్నవరపు రామాస్వామివారు పద్మశ్రీ శ్రీమతి శోభారాజు, శ్రీమతి జయమణి నరసింహం గారు మొదలైన వారు పాల్గొంటారు. ఈ కార్యక్రమానికి తితిదే కార్యనిర్వహణాధికారి, సాధికారిక అధ్యకక్షులు శ్రీ జె. సత్యనారాయణ ఐ.ఎ.ఎస్., సాధికార మండలి సభ్యులు – శ్రీ వి.నాగిరెడ్డి ఐ.ఎ.ఎస్., మరియు జె.ఇ.ఓ. తిరుమల, జె.ఇ.ఓ- తిరుపతి, ముఖ్య నిఘా మరియు భద్రతాధికారి, ఛీఫ్ ఇంజనీరు మరియు ప్రిన్సిపల్ సెక్రటరీ టు గవర్నర్ ఆంధ్రప్రదేశ్ మొదలైన ప్రముఖులు పాల్గొంటారు. ఈ వేదికపై కార్యక్రమం అనంతరం ఆస్థాన మండపములో ప్రముఖ విద్వాంసులు, సంగీత ప్రముఖులచే సాయంత్రము వరకు కార్యక్రమములు నిర్వహింపబడతాయి.
తాళ్ళపాక అన్నమాచార్యుల వారి 508వ వర్థంతి మహోత్సవ సందర్భముగా తిరుపతి అన్నమాచార్య కళామందిరంలో 31-03-2011 నుండి 06-04-2011 వరకు సంగీత, నృత్య, సాహిత్య కార్యక్రమములు నిర్వహింపబడును. ఈ కార్యక్రమములో ప్రముఖ సంగీత విద్యాంసులు పాల్గొంటారు. 01-04-2011 నుండి 05-04-2011 వరకు ఉదయం 10-30 గంటలకు సాహిత్య సదస్సు జరుగును. ఈ సదస్సులో ప్రముఖ సాహితీ వేత్తలు డా. సముద్రాల లక్ష్మణయ్య గారు, విద్వాన్ శ్రీ ముదివర్తి కొండమాచార్యుల వారు, ఆచార్య మన్నవ భాస్కర నాయుడు గారు, ఆచార్య రవ్వా శ్రీహరి గారు, శ్రీ కామిశెట్టి శ్రీనివాసులు గారు మరియు వివిధ విశ్వవిద్యాలయాల నుండి పాల్గొనెదరు.
మహతి ఆడిటోరియం- తిరుపతి:
తేది:31-03-2011 నుండి 06-04-2011 సాయంత్రం 4.30 గంటల నుండి సంగీత మరియు నృత్య కార్యక్రమాలు నిర్వహింపబడను.
ఈ కార్యక్రమంలో అన్నమాచార్య ప్రాజెట్టు కళాకారులు మరియు వివిధ ప్రదేశాల నుండి ప్రముఖ సంగీత విద్వాంసులు మరియు నాట్యకళాకారులు పాల్గొనెదరు.
ఆస్థానమండపము – తిరుచానూరు
తేది:31-03-2011 నుండి 02-04-2011 వరకు సాయంత్రం 5.30 గంటల నుండి సంగీత కార్యక్రమాలు నిర్వహింపబడును. ఈ కార్యక్రమంలో ప్రముఖ సంగీత విద్వాంసులు పాల్గొంటారు.
ధ్యాన మందిరము – తాళ్ళపాక – కడప జిల్లా
తేది:31-03-2011 నుండి 06-04-2011 వరకు సంగీత, హరికథ కార్యక్రమములు నిర్వహింపబడను.
తేది:31-03-2011 ఉదయం 8-00 గంటలకు బహుళ ద్వాదశి పూజా కార్యక్రమము జరుగును.
తేది:31-03-2011 ఉదయం 9-30 గంటలకు శ్రీమాన్ తాళ్ళపాక అన్నమాచార్యులవారి చిత్రపటము ఊరేగింపు అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులచే నగర సంకీర్తన నిర్వహింపబడును.
108 అడుగుల అన్నమయ్య విగ్రహము – తాళ్ళపాక
తేది:31-03-2011 నుండి 06-04-2011 వరకు సంగీత, హరికథ కార్యక్రమములు నిర్వహింపబడును.
శ్రీలక్ష్మీ వేంకటేశ్వరస్వామి వారి దేవాలయ ప్రాంగణం – దేవుని కడప
తేది:31-03-2011 నుండి 02-04-2011 వరకు హరికథ కార్యక్రమములు జరుగును.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.