TTD TO BUILD 1342 SRIVARI TEMPLES THROUGH SRIVANI TRUSTS FUNDS- TTD EO _ శ్రీవాణి ట్రస్టు ద్వారా రాష్ట్రంలో 1342 ఆలయాల నిర్మాణం – టీటీడీ ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి
TTD JEO Sri Veerabrahmam, Samarasata Seva foundation representative Sri Trinath were also present.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
శ్రీవాణి ట్రస్టు ద్వారా రాష్ట్రంలో 1342 ఆలయాల నిర్మాణం – టీటీడీ ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి
తిరుపతి, 2022 ఆగస్టు 25: శ్రీవాణి ట్రస్టు ద్వారా సనాతన హైందవ ధర్మ వ్యాప్తి, మత మార్పిడులను అరికట్టేందుకు రాష్ట్ర వ్యాప్తంగా మరో 1342 ఆలయాలు నిర్మించేందుకు రాష్ట్ర దేవాదాయ శాఖ ద్వారా సమరసత సేవా ఫౌండేషన్‌తో ఒప్పందం చేసుకున్నట్లు టీటీడీ ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి తెలిపారు. తిరుపతి శ్రీ పద్మావతి విశ్రాంతి భవనంలోని సమావేశ మందిరంలో గురువారం సమరసత సేవా ఫౌండేషన్ తో ఎంవోయు చేసుకున్నారు.
ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ , శ్రీవాణి ట్రస్టు ద్వారా సమరసత సేవా ఫౌండేషన్ సహకారంతో మొదటి విడతలో రూ.25 కోట్లతో రాష్ట్రంలో టీటీడీ 502 ఆలయాలు నిర్మించిందన్నారు. టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి ఆదేశాల మేరకు మరో 1342 ఆలయాల నిర్మాణం కోసం సర్వే చేసి వివరాలు అందించడం జరిగిందని చెప్పారు. 1342 ఆలయాల్లో మొదటగా 120 ఆలయాలను నిర్మించనున్నట్లు తెలిపారు. ఇందుకు సంబంధించిన ఆలయాల జాబితా, స్థల సేకరణ, ఆలయ కమిటీ ఏర్పాటు చేయడం పూర్తయిందన్నారు.
పురాతన హిందూ దేవాలయాలు, శిథిలమైపోతున్న ఆలయాలను పునః నిర్మించడం, ఆధునీకరించడం కోసం శ్రీవాణి ట్రస్ట్‌ను టీటీడీ 2019వ సంవత్సరం ఏర్పాటు చేసినట్లు తెలియజేశారు. ఇప్పటివరకు శ్రీవాణి ట్రస్టుకు రూ.500 కోట్లకు పైగా విరాళాలు అందాయన్నారు. శ్రీవాణి ట్రస్టు విరాళాల ద్వారా ఆలయాల్లో అవసరమైన మరమ్మత్తులు, ధూప దీప నైవేద్యాలకు ఆర్థిక సహాయం అందిస్తున్నామన్నారు. సెప్టెంబరు 3వ తేదీన జరిగే శ్రీవాణి ట్రస్ట్ సమావేశంలో ఆలయాల నిర్మాణంపై విధివిధానాల రూపొందిస్తామన్నారు.
అనంతరం సమరసత సేవా ఫౌండేషన్ చైర్మన్ శ్రీ తాళ్ళూరు విష్ణు మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా 1342 ఆలయాలు నిర్మించేందుకు టీటీడీతో ఒప్పందం చేసుకున్నామన్నారు. ఆరు నెలల కాలంలో ఈ ఆలయాల నిర్మాణం పూర్తి చేయనున్నట్లు ఆయన చెప్పారు. శ్రీ వేంకటేశ్వర స్వామి వారు తమ సంస్థ ద్వారా ఆలయాలు నిర్మించే అవకాశం కల్పించడం తమ పూర్వజన్మ సుకృతమని అన్నారు .
ఈ సమావేశంలో టీటీడీ జేఈవో శ్రీ వీర బ్రహ్మం , సమరసత సేవా ఫౌండేషన్ ప్రతినిధి శ్రీ త్రినాథ్ పాల్గొన్నారు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.