శ్రీవారి ఆలయంలో జ్యేష్ఠాభిషేకం ప్రారంభం

శ్రీవారి ఆలయంలో జ్యేష్ఠాభిషేకం ప్రారంభం
 
తిరుమల, 2020 జూన్ 04: తిరుమల శ్రీవారి ఆలయంలో మూడు రోజుల పాటు నిర్వహించే జ్యేష్టాభిషేకం గురువారంనాడు  ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఆలయంలోని సంపంగి ప్రదక్షిణంలో ఉన్న కల్యాణమండపంలో ఉదయం, సాయంత్రం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు ఉదయం ఋత్వికులు యాగశాలలో శాంతిహోమం నిర్వహించారు. శతకలశ ప్రతిష్ఠ ఆవాహన, నవకలశ ప్రతిష్ఠ ఆవాహన, కంకణ ప్రతిష్ఠ అనంతరం స్వామి, అమ్మవార్లకు అర్ఘ్యం, పాద్యం, ఆచమనీయం చేసి కంకణధారణ చేశారు. ఆ తరువాత శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారికి  స్నపనతిరుమంజనం నిర్వహించారు. ఇందులో వేదపండితులు శ్రీసూక్తం, భూసూక్తం, పురుష సూక్తం, నీలా సూక్తం, నారాయణసూక్తాలను పఠిస్తుండగా పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, చందనంతో ఉత్సవమూర్తులకు విశేషంగా అభిషేకం చేపట్టారు. 
 
ఈ కార్యక్రమంలో టిటిడి శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌స్వామి, టిటిడి ఛైర్మ‌న్ శ్రీ వై.వి.సుబ్బారెడ్డి, ఈ ఓ శ్రీ అనిల్ కుమార్ సింఘాల్ ,అద‌న‌పు ఈవో శ్రీ ఏ.వి.ధ‌ర్మారెడ్డి,  ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ హరీంద్రనాథ్‌ ఇతర అధికారులు పాల్గొన్నారు.
 
టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.