శ్రీవారి ఆలయంలో రేపు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

శ్రీవారి ఆలయంలో రేపు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

తిరుమల, 2010 జూలై 12: తిరుమల శ్రీవారి ఆలయంలో ఈ నెల 13వ తేదిన కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం జరుగుతుంది. జూలై 17వ తేదిన ఆలయంలో ఆణివార ఆస్థానం జరుగుతుంది. ఈ ఉత్సవానికి ముందు మంగళవారం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం జరగడం ఆనవాయితి.

ఆ రోజున శ్రీవారి ఆలయంలో జరిగే అష్టదళ పాదపద్మారాధన సేవను రద్దు చేసారు.

తిరుమల శ్రీవారి ఆలయానికి సంవత్సరంలో నాలుగు మార్లు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం జరుగుతుంది. ఉగాదికి ముందు, ఆణివార ఆస్థానానికి ముందు, బ్రహ్మోత్సవాలకు ముందు, వైకుంఠ ఏకాదశికి ముందు వచ్చే మంగళవారాల్లో శ్రీవారి ఆలయాన్ని శుభ్రంగా కడగడం అనే కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం జరుగుతుంది.

గర్భాలయంలోని అన్ని ఉత్సవ విగ్రహాలు, బంగారు వెండి పాత్రలు బంగారు వాకిలి వరకు తెస్తారు. లోపల గోడలు పై కప్పులు అంతటా కడిగి శుభ్రం చేస్తారు.

పిదప నామంకోపు, శ్రీచూర్ణం, గడ్డకర్పూరం, గంధంపొడి, కుంకుమ, ఖిచిలిగడ్డ తదితర వస్తువుల సుగంధపరిమళ మిశ్రమాన్ని ఆలయ గోడలకు పూసి శుభ్రం చేస్తారు.

ఈ సేవను ఆర్జితంగా కూడా ప్రవేశపెట్టబడింది. రూ.3000/-లు చెల్లించి 10 మంది ఈ సేవలో పాల్గొనవచ్చును.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.