శ్రీవారి సేవకులకు విజ్ఞప్తి 

శ్రీవారి సేవకులకు విజ్ఞప్తి

తిరుపతి, జనవరి 11, 2013: ”మానవ సేవయే మాధవ సేవ” అన్న ఆర్యోక్తి ఆధారంగా తితిదే నవంబరు, 2000వ సంవత్సరంలో ”శ్రీవారి సేవ” పేరుతో ఒక స్వచ్ఛంద సేవా కార్యక్రమాన్ని ఉన్నత ప్రమాణాలతో, ఉన్నతాశయాలతో ప్రారంభించింది.
 
శ్రీవారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసే వేలాది మంది భక్తులకు సాటి భక్తులతో సముచిత సేవలు అందించడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యం. శ్రీవారి సేవకులుగా సాటి భక్తులకు సేవలందించే భక్తులు గత 12 సంవత్సరాలుగా విశేషరీతిలో స్వచ్ఛంద సేవలను అకుంఠిత దీక్షతో, నిబద్ధతతో, భక్తి శ్రద్ధలతో, క్రమశిక్షణతో అందిస్తూ సేవ యొక్క పరమార్థాన్ని చాటి చెబుతున్నారు.
 
గత 12 ఏళ్ల మహాప్రస్థానంలో ఇంతింతై వటుడింతై అన్న చందాన ఎదిగిన శ్రీవారి సేవను మరింత బలోపేతం చేయాలన్న దృఢనిశ్చయంతో తితిదే యాజమాన్యం అనేకానేక నూతన సేవలను ఇటీవల కాలంలో ప్రవేశపెట్టింది. భవిష్యత్తు అవసరాల దృష్ట్యా ముఖ్యంగా శ్రీవారి సేవకులలో ‘సేవాభావాన్ని’ ఇనుమడింపజేయడానికి ప్రత్యేక శిక్షణ కూడా ఇవ్వడానికి తితిదే సమాయత్తమవుతోంది.
 
ఈ క్రమంలో శ్రీవారిసేవకులకు తగిన ధార్మిక, ఆధ్యాత్మిక, సేవా తత్పరతతో, క్రమశిక్షణాయుత వాతావరణంతో కూడిన శిక్షణను అందించడానికి ”శిక్షకుల”ను ఆహ్వానిస్తున్నది.
సేవా శిక్షకులు(ట్రయినర్స్‌) ఇందుకు గాను భారతీయ హైందవ సనాతన ధర్మం పట్ల, ధార్మిక చింతన పట్ల, సంస్కృతి సాంప్రదాయాల పట్ల మంచి అవగాహన, పరిచయం, అనుభవం ఉన్న భక్తులను తితిదే ఈ ఉన్నత సేవా కార్యక్రమంలో పాల్గొనడానికి ఆహ్వానిస్తున్నది. వీరి సేవలను ఆరు నెలల పాటు తితిదే వినియోగించుకోనుంది. ముందుగా వీరికి సంబంధించిన విధివిధానాలలో శిక్షణ ఇచ్చేందుకు కూడా తితిదే తగిన ఏర్పాట్లు చేయనుంది. వీరికి ప్రత్యేక శిక్షకుల(మాస్టర్‌ ట్రయినర్స్‌) ద్వారా తిరుపతిలోని శ్వేత భవనంలో శిక్షణ కూడా ఇవ్వనుంది. కాగా వీరి సేవ సమయంలో( సుమారు 6 నెలలు) వీరి కొరకు తిరుమల మరియు తిరుపతిలో బస చేయడానికి వీలుగా ఉచిత వసతి, భోజనం, రవాణా సౌకర్యాలను కూడా తితిదే ఏర్పాటు చేయనుంది.
 
వివిధ రంగాల్లో నిపుణులైన వారితో శ్రీవారిసేవ(ప్రొఫెషనల్స్‌)
భవిష్యత్తులో భక్తులకు మరింత సమర్థవంతమైన సేవలను అందించడంలో భాగంగా తితిదే వివిధ రంగాల్లో నిష్ణాతులైన వారిని కూడా శ్రీవారి సేవలో భాగస్వాములను చేయాలని నిర్ణయించింది. అందులో భాగంగా ఆరోగ్య, వైద్య, నిర్మాణ, భద్రత, పాకశాస్త్ర, విద్యారంగ నిపుణులను కూడా భాగస్వాములను చేయాలని నిర్ణయించింది. వీరి సేవలను సంబంధిత విభాగాల్లో సముచిత రీతిలో భక్తుల కొరకు వినియోగించుకోవడం జరుగుతుంది.
 
శ్రీవారి భక్తులకు స్వచ్ఛందంగా సేవలందించడానికి సంసిద్ధతను వ్యక్తపరిచే నిపుణుల సేవలను తిరుపతి, తిరుమల పుణ్యక్షేత్రాలలో వినియోగించుకోవడానికి తితిదే ఏర్పాట్లు చేస్తున్నది. కాగా వీరికి కూడా ప్రత్యేక శిక్షకుల(మాస్టర్‌ ట్రయినర్స్‌) ద్వారా తిరుపతిలోని శ్వేత భవనంలో శిక్షణ ఇవ్వనుంది. కాగా వీరి నిర్ణీత సేవా వ్యవధిలో తితిదే వీరి కొరకు బస, రవాణా, భోజన వసతులను తిరుపతి మరియు తిరుమలలో ఉచితంగా కల్పించేందుకు కూడా తితిదే నిర్ణయించింది.
 
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.