”శ్రీవేంకటేశ్వర శ్రవణం” వినికిడిలోపం ఉన్న చిన్నరులకు వరం
”శ్రీవేంకటేశ్వర శ్రవణం” వినికిడిలోపం ఉన్న చిన్నరులకు వరం
తిరుపతి, 2010 జూన్ 11: తిరుమల తిరుపతి దేవస్థానము వారు మానవసేవే మాధవ సేవగా భావించి ఎన్నో బృహత్తర కార్యక్రమాలను చేపట్టుతున్నారు. ఇందులో భాగంగా వినికిడి లోపం గల చిన్నపల్లలను నిర్ధారించి, వారి లోపాన్ని అధిగమించి వారు సాధారణ జీవితం గడుపునట్లు చేయుటకు ”శ్రీవేంకటేశ్వర శ్రవణం” సంస్థను ఏర్పాటుచేసారు.
ఈ శ్రవణం సంస్థను 15-12-2006 సంవత్సరంలో అప్పటి ఛైర్మన్ కరుణాకర రెడ్డి, ఇ.ఓ. ఎ.పి.వి.యన్. శర్మ, జె.ఇ.ఓలు ముక్తేశ్వరరావు, బలరామయ్య, సి.యమ్.ఓ. హరిరావు గార్ల ఆధ్వర్యంలో సప్తగిరి బిల్డింగ్‌లో 15 మంది పిల్లలు, ఇద్దరు టీచర్లతో ప్రారంభమైనది.
అటు తరువాత 30-03-2009 సంవత్సరంలో శ్రవణం సంస్థను ఇ.ఓ. రమణాచారి, జె.ఇ.ఓ. శేషాద్రి, సి.యమ్.ఓ. శారద గార్ల ఆధ్వర్యంలో ఓల్డ్ మెటర్నిటీ ప్రాంగణంలోనికి మార్చడమైనది. ఇలా దినదినాభివృద్ధి చెందుతూ ”శ్రవణం” సంస్థ నేడు 148 మంది పిల్లలకు 25 మంది టీచర్లతో శిక్షణను అందిస్తున్నది.
ప్రతి 1000 మందిలో ఒకరు వినికిడి లోపంతో జన్మిస్తున్నారు. భారతదేశం మొత్తంలో 25,000 మంది సంవత్సరానికి వినికిడి లోపంలో జన్మిస్తున్నారు. కాగా ఆంధ్రప్రదేశ్‌లో సంవత్సరానికి 1900ల మంది వినికిడి లోపంతో జన్మిస్తున్నారని జాతీయ గణాంకాల ద్వారా తెలియుచున్నది.
చిన్నపిల్లలల్లో వినికిడి లోపం ఉన్నందువల్ల వాళ్ళు మాటల్లో, భాషలో, విద్యలో, ఆవేశాల నియంత్రణలో కుటుంబంలో, సమాజంలో నిరాధరణ చెందుతున్నారు. తద్వారా ఆకుటుంబము కూడా సమాజంలో చిన్నచూపుకు గురి అవుతున్నది. ఆధునికమైన శాస్త్ర,సాంకేతిక విజ్జాన పరిశోధనల వల్ల స్పష్టమైన విషయం ఏమంటే పిల్లకు ఒక సంవత్సరం వయస్సు వచ్చే లోపలే వినికిడి లోపాలను గుర్తించగలిగి శిక్షణ ఇవ్వకలిగి 3,4 సంవత్సరాల్లో ఆలోపాలు సరిదిద్దబడి అభివృద్ధిలోనికి తీసుకొనిరావచ్చు.
అప్పుడే పుట్టిన పిల్లలలో వినికిడి లోపాన్ని గుర్తించి వెంటనే వినికిడి యంత్రాలను అమర్చి శిక్షణ ప్రారంభించడం ద్వారా వారి భాషలో స్పష్టతను తీసుకురావచ్చునని తితిదే వారు స్థానిక ప్రసూతి ఆసుపత్రిలో శ్రవణంను 03-12-2009 తేదిన ప్రారంభించారు.
వినికిడి లోపం రావడానికి ముఖ్య కారణాలు :
వంశపారపర్యం, మేనరికపు వివాహాలు, నెలలు నిండకుండా పుట్టడం, తల్లికి గర్భసమయంలో రూబెల్లారావడం, ష్ట్రక-ఖీలి, ఎక్కువ ఫవర్ ఉన్న మాత్రలు వాడటం మొదలైనవి.
గుర్తించడం ఎలా?
– నిద్రపోతున్న శిశువు పెద్ద శబ్ధానికి కూడా స్పందించకుండుట
– ఆరునెలల బిడ్డ అమ్మ పిలిచినప్పుడు తిరిగి చూడ కుండుట
– ఒక సంవత్సరము పూర్తి అయిన బిడ్డ మాట్లాడలేకుండుట
– సంవత్సరము పైబడిన బిడ్డ సైగల ద్వారా అవసరాలను తెలుపుచుండినా
– మనం మాట్లాడేటప్పుడు మన పెదాలవైపే చూస్తున్నా, మొదలైన వాటి ద్వారా గుర్తించవచ్చును.
శ్రవణంలో ప్రవేశం ఎలా?
తమ పిల్లవానికి చెవినొప్పి అనో లేక పిల్లవాడు ఇంకా మాట్లాడటం లేదనో సాధారణంగా తల్లిదండ్రులు ఇఎన్‌టి డాక్టర్ దగ్గరకు వెళ్ళుతుంటారు. వారు వారి చెవి,గొంతు, ముక్కులను పరీక్షచేసి గొంతులోగాని, ముక్కులోగాని సమస్యలు లేవని గ్రహించిన తరువాత చెవిలో సమస్య ఉండవచ్చు అని గ్రహించి మధ్యచెవిలో సమస్యఉన్నదా లేక లోపలి చెవిలో సమస్య ఉన్నదా మరియు వినికిడి స్థాయిని పరీక్షించుటకుగాను ఆడియాలజిస్ట్ ల దగ్గరకు పంపుతారు.
అలాగే మద్య చెవిలో, లోపలి చెవిలో సమస్య ఉన్నదా అని పరీక్ష చేస్తారు. ఒకవేళ వినికిడి బాగుండి మధ్యచెవిలో చీము కారడం లేదా కర్ణబేరికి రంధ్రం పడడం, గుబిలి ఉండటం వంటివి అయితే తిరిగి ఇఎన్‌టి డాక్టర్‌ల వద్దకు చికిత్స కొరకు పంపుతారు. అలా ఏమి లేకుండా వినికిడిలోపం ఉన్నట్లయితే వారిని కౌన్సిలింగ్ మరియు అడ్మిషన్ కొరకు శ్రవణం టీచర్ ఇన్‌ఛార్జీ వద్దకు పంపుతారు.
శ్రవణం ముఖ్య అంశాలు:
సంవత్సరం పొడవునా అడ్మిషన్ (ప్రవేశములు) జరుగును.
కేవలం వినికిడి లోపం కలిగి, మాటలు రాని పిల్లలకు మాత్రమే శిక్షణ ఇవ్వబడును.
ఇతర లోపాలు ఉండరాదు.
పిల్లవానితో పాటు తల్లి/సంరక్షకురాలు తప్పక ఉండవలెను.
పిల్లలకు 0-3 సంవత్సరములోపు వయస్సు ఉండవలెను.
చదువురాని తల్లులకు చదువు నేర్పబడును.
తల్లి మరియు బిడ్డకు ఉచిత శిక్షణ మరియు హాస్టల్ సౌకర్యములు కలవు.
అనే ప్రత్యేక శిక్షణ పొందిన టీచర్లచే ఇక్కడ పిల్లలకు శిక్షణ ఇవ్వబడును.
పిల్లలు వినడం, మాట్లాడడం, చదవడం, రాయడం, లెక్కలు చేయడం మొదలైన వాటిలో నైపుణ్యం పొందగలరు.
పిల్లలకు 51/2 సంవత్సరాలు నిండిన తరువాత సాధారణ పాఠశాలలో ఒకటవ తరగతి చేరి సాధారణ పిల్లలవలె విద్యను అభ్యసించగలరు.
ఉచితముగా ఒక్కొచెవికి ఒక్కొక్క వినికిడి యంత్రం ఇవ్వబడును.
విశాలమైన గదులు మరియు ఆవరణం
టీచర్ మరియు విద్యార్థి నిష్పత్తి1:1 తో ప్రారంభమై 1:4తో ముగియును.
రంగురంగుల ఆట వస్తువులను ఉపయోగించి ఆటపాటల ద్వారా భాషాభివృద్ధి మరియు విద్యాబోధన జరుగును.
వినికిడి లోపం వలన పిల్లల్లో పెంపొందే కోపోద్వేగాలు మరియు నడవడిక సమస్యలను కూడా ఈ శిక్షణ ద్వారా నివారించవచ్చు.
”ధ్వని” అనే ప్రత్యేక బోధనా పద్దతి ద్వారా శిక్షణ ఇవ్వబడును.
వినికిడి లోపం గల పిల్లలు తల్లిదండ్రులు మానసిక ఒత్తుడులతో మనోవేదనతో, నిస్సహాయస్థితిలో శ్రవణం సంస్థకు వచ్చినప్పుడు కౌన్సిలింగ్ ద్వారా వారిలో మనోధైర్యాన్ని పెంపొందింపచేసి, వారి పిల్లల భాషాభివృద్ధిలో తల్లిదండ్రులను కూడా భాగస్వాములను చేస్తాము. నిరక్షరాస్యులైన తల్లి/సంరక్షకురానికి విద్యను నేర్పించి వారు వారి పిల్లలకు శిక్షణనిచ్చేలా తీర్చిదిద్దుతాము.
పిల్లల వినికిడి లోపంపై తల్లిదండ్రుల మూఢనమ్మకాలు:
చాలా మంది తల్లిదండ్రులు ఎన్నో మూఢనమ్మకాల ద్వారా కాలం వృధా చేస్తుంటారు. ఉదాహరణగా పిల్లవాడి నాన్న 5 సంవత్సరాలకు మాట్లాడాడు. కాబట్టి పిల్లవాడు కూడా 5 సంవత్సరాలకు మాట్లాడుతాడులే అని నిర్లక్ష్యం చేస్తారు. ఒక డాక్టరు మీ అబ్బాయికి వినబడుట లేదు అని చెప్పారని దాని నిర్థారణ కొరకు ఇంకొక డాక్టరు వద్దకు తిరుగుతూ కాలయాపన చేస్తుంటారు.
తిరుమల తిరుపతి దేవస్థానముల వారు వినికిడి లోపంతో పుట్టిన పిల్లలు మూగవారు కాకుండా ఉండటానికి వినికిడి పరీక్షలు చేసి, వారి వినికిడి శక్తిని పెంపొందింపచేసేలా రెండు చెవులకు విడి విడిగా రెండు వినికిడి యంత్రాలను అమర్చి, ప్రత్యేక శిక్షణ ఇచ్చి వారిలో భాషను అభివృద్ధిచేసి సాధారణ పిల్లలవలె పాఠశాలల్లో చేరి విద్యను అభ్యసించి తద్వారా వారి భావి జీవితాన్ని బంగారు బాట చేసుకునేలా చేయటానికిగాను శ్రవణం (శ్రీవేంకటేశ్వర వినికిడిలోప నిర్ధారణ మరియు శిక్షణా సంస్థ)ను ప్రారంభించారు. కావున 0-3 సంవత్సరాల వయస్సు గల పిల్లల తల్లిదండ్రులు వెంటనే శ్రవణం సంస్థను సంప్రదించవలెను.
సంప్రదించవలసిన చిరునామా:
శ్రవణం కాంప్లెక్స్,
ఓల్డ్ మెటర్నిటీ ఆసుపత్రి,
తిరుపతి.
ఫోన్:0877-2264290, 0877-2264371.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.