శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయ సాక్షాత్కార వైభవోత్సవాలకు సర్వం సిద్ధం

శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయ సాక్షాత్కార వైభవోత్సవాలకు సర్వం సిద్ధం

 తిరుపతి, జూలై 10, 2013: ఈ నెల 12 నుండి 14వ తేదీ వరకు జరుగనున్న శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయ సాలకట్ల సాక్షాత్కార వైభవోత్సవాలకు సర్వం సిద్ధమైంది. ఈ ఉత్సవాన్ని అత్యంత ఘనంగా నిర్వహించేందుకు తితిదే విస్తృత ఏర్పాట్లు చేసింది. ఉత్సవంలో ఎక్కువ సంఖ్యలో భక్తులను భాగస్వాములను చేసేందుకు తిరుపతి, పరిసర ప్రాంతాల్లో ప్రచార రథాల ద్వారా ప్రచారం చేశారు. ప్రముఖ కూడళ్లలో ఫ్లెక్సీ బ్యానర్లు, విద్యుద్దీపాలంకరణలు చేపట్టారు. తితిదే ఉద్యోగుల కోసం క్వార్టర్స్‌ నుండి, యాత్రికుల కోసం విష్ణునివాసం, శ్రీనివాసం వసతి సముదాయాల నుండి, భక్తుల కోసం స్థానిక ఆలయాల నుండి ఉచిత బస్సులు నడుపనున్నారు.

ఈ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ఉదయం స్వామి, అమ్మవార్ల ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం, సాయంత్రం 6.00 గంటల నుండి 7.00 గంటల వరకు ఊంజల్‌ సేవ, రాత్రి 7.00 నుండి 8.00 గంటల వరకు ఆలయ నాలుగు మాడ వీధుల్లో తిరుచ్చి ఉత్సవం జరుపుతారు.

జూలై 13వ తేదీన ఉదయం 10.00 నుండి 11.30 గంటల వరకు ఉత్సవర్లకు స్నపనతిరుమంజనం, సాయంత్రం 6.00 నుండి 7.00 గంటల వరకు ఊంజల్‌ సేవ, రాత్రి 8.00 నుండి 9.00 గంటల వరకు హనుమంత వాహనసేవ నిర్వహిస్తారు.

అలాగే మూడో రోజైన జూలై 14వ తేదీన ఉదయం 10.00 నుండి 11.30 గంటల వరకు స్వామి, అమ్మవార్ల ఉత్సవర్లకు స్నపనతిరుమంజనం నిర్వహించనున్నారు. సాయంత్రం 6.00 నుండి 7.00 గంటల వరకు ఊంజల్‌ సేవ, రాత్రి 8.00 నుండి 9.30 గంటల వరకు గరుడ సేవ నిర్వహిస్తారు.

ఈ సందర్భంగా జూలై 9వ తేదీన స్వర్ణపుష్పార్చన సేవ, జూలై 12 నుండి 14వ తేదీ వరకు ఆర్జిత కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం సేవలు రద్దు కానున్నాయి. అదేవిధంగా తితిదే హిందూ ధర్మప్రచార పరిషత్తు, అన్నమాచార్య ప్రాజెక్టు, ఎస్వీ సంగీత, నృత్య కళాశాల ఆధ్వర్యంలో ప్రతిరోజూ ఆధ్యాత్మిక భక్తి సంగీత కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

తి.తి.దే ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.