జూలై 21 నుండి తమిళనాడులో గురువందన మహోత్సవం

జూలై 21 నుండి తమిళనాడులో గురువందన మహోత్సవం

తిరుపతి, జూలై 10, 2013: తితిదే దాససాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో జూలై 21, 22వ తేదీల్లో తమిళనాడులోని తిరుకోయిలూరులో గురువందన మహోత్సవం వైభవంగా జరుగనుంది. శ్రీ వేంకటేశ్వరుడి వైభవాన్ని నలుదిశలా వ్యాప్తి చేసేందుకు దాస సాహిత్య ప్రాజెక్టు విశేష కృషి చేస్తోంది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో భజన మండళ్లను ఏర్పాటుచేసుకుని పలు కార్యక్రమాలు నిర్వహిస్తోంది.

ఇందులో భాగంగానే ప్రతి ఏటా వివిధ ప్రాంతాల్లో గురువందన మహోత్సవం లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తోంది. గురువందన మహోత్సవంలో భాగంగా ప్రముఖ సంగీత విద్వాంసులతో సంగీత కచేరీలు ఏర్పాటు చేయనున్నారు. అలాగే భారతీయ సనాతన హైందవ ధర్మం వైశిష్ట్యాన్ని తెలిపేలా ప్రముఖ పండితులు ఆధ్యాత్మిక ఉపన్యాసాలు చేస్తారు. అదేవిధంగా తమిళనాడు రాష్ట్రవ్యాప్తంగా విచ్చేసే 150 మంది భజన బృందాల సభ్యులు భజనలు, కోలాటాలు నిర్వహించనున్నట్టు దాససాహిత్య ప్రాజెక్టు ప్రత్యేకాధికారి శ్రీ పి.ఆర్‌.ఆనందతీర్థాచార్య తెలిపారు.
 
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.