PAVITROTSAVAMS COMMENCES IN TIRUCHANOOR _ శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో వైభవంగా పవిత్రోత్సవాలు
శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో వైభవంగా పవిత్రోత్సవాలు
రుపతి, 2012 సెప్టెంబరు 27: తిరుచానూరులోని శ్రీపద్మావతి అమ్మవారి ఆలయంలో గురువారం నుండి పవిత్రోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా మొదటిరోజు శ్రీ పద్మావతి అమ్మవారికి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి సహస్రనామార్చన నిర్వహించారు. అనంతరం ఉత్సవర్లను ఆలయం నుండి యాగశాలకు వేంచేపు చేశారు. అనంతరం ద్వారతోరణ ధ్వజకుంభ ఆవాహనం, చక్రాధి మండలపూజ, చతుస్థానార్చన, అగ్నిప్రతిష్ఠ, పవిత్రప్రతిష్ఠ నిర్వహించారు.
మధ్యాహ్నం 2 గంటల నుండి 3.30 గంటల వరకు శ్రీ కృష్ణస్వామి మండపంలో అమ్మవారికి శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పసుపు, చందనం, పాలు, పెరుగు, తేనె, పన్నీరు, వివిధ రకాల ఫలాలతో అభిషేకం చేశారు. అనంతరం అమ్మవారికి విశేషంగా అలంకారం చేశారు. కాగా పవిత్రోత్సవాల కారణంగా కళ్యాణోత్సవం, ఊంజల్‌సేవ, తిరుప్పావడసేవ, లక్ష్మీపూజ, పుష్పాంజలి ఆర్జిత సేవలను రద్దు చేశారు.
కాగా మొదటిరోజు పవిత్రోత్సవాల్లో తితిదే పాలకమండలి అధ్యకక్షులు శ్రీ కనుమూరి బాపిరాజు, కార్యనిర్వహణాధికారి శ్రీ ఎల్వీ సుబ్రమణ్యం, తిరుపతి జెఈఓ శ్రీ పి.వెంకట్రామిరెడ్డి, స్థానిక ఆలయాల డెప్యూటీ ఈఓ శ్రీ గోపాలకృష్ణ, ఆలయ అర్చకులు, ఏఈఓ శ్రీ వేణుగోపాల్ ఇతర అధికార ప్రముఖులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
అంతకుముందు తితిదే పాలకమండలి అధ్యకక్షులు శ్రీ కనుమూరి బాపిరాజు పేరూరు బండపై గల శ్రీ వకుళామాత ఆలయ పరిసరాలను పరిశీలించారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.