శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక పవిత్రోత్సవాలను పురస్కరించుకొని కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఘనంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
తిరుపతి, 2022 సెప్టెంబరు 06: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో సెప్టెంబరు 8 నుంచి 10వ తేదీ వరకు జరగనున్న పవిత్రోత్సవాలను పురస్కరించుకొని మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం ఘనంగా జరిగింది.
ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి ఉదయం 7 నుండి 9.30 గంటల వరకు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం చేపట్టారు. ఇందులో ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుద్ధి చేశారు. అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర జలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేశారు. అనంతరం భక్తులకు సర్వదర్శనం కల్పించారు.
ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీలోకనాథం, ఏఈవో శ్రీ ప్రభాకర్ రెడ్డి, సూపరింటెండెంట్ శ్రీ మధు, ఆలయ అర్చకులు శ్రీ బాబుస్వామి పాల్గొన్నారు.
పరదాలు విరాళం :
హైదరాబాద్కు చెందిన శ్రీ స్వర్ణకుమార్ రెడ్డి ఆలయానికి మంగళవారం ఉదయం 17 పరదాలు విరాళంగా అందించారు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.