SRI MAHABHARATHAM HARIKATHA PARAYANAM AT SRI RAMACHANDRA PUSHKARNI_ శ్రీ రామచంద్ర పుష్కరణి నందు శ్రీ మహాభారతం హ‌రిక‌థ పారాయ‌ణం ప్రారంభం

శ్రీ రామచంద్ర పుష్కరణి నందు శ్రీ మహాభారతం హ‌రిక‌థ పారాయ‌ణం ప్రారంభం

తిరుపతి, జూన్‌-25, 2008: ధర్మశాస్త్రజ్టులు ధర్మశాస్త్రమనీ, వేదాంతవేత్తలు వేదాంతమనీ, నీతిజ్ఞులు విశిష్ట నీతి శాస్త్రమనీ, ఎందరో మహానుబావులు దీనిని మహత్తరమైన మానవీయ విలువల మహా భాండాగారమనీ వేనోళ్ళ కీర్తించబడిన ”మహాభారత” కథాంశాన్ని, 18 రోజులపాటు హరికథా రూపంలో స్థానిక శ్రీరామచంద్ర పుష్కరిణి వేదికగా హిందూ ధర్మప్రచార పరిషత్తు ఆధ్వర్యంలో ప్రారంభించింది.

ధర్మ ప్రచార పరిషత్తు కార్యదర్శి డా||చిలకపాటి విజయరాఘవాచార్యులు తమ ప్రారంభోపన్యాసంలో తి.తి.దే., ఎప్పుడూ భక్తుల దైవిక, ఆధ్యాత్మిక ఆశయాలను, ఆకాంక్షలకు సానుకూలంగా స్పందిస్తూనే ఉన్నదనీ, శ్రీరామచంద్ర పుష్కరిణి వేదిక స్థానికంగా అనతి కాలంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకంగా విశ్రాంత వయస్కులైన పెద్దల ఆదరాభిమానాలతో, భాగసామ్యంతో ఆధ్యాత్మిక కేంద్రంగా రూపొందుతోందనీ, వారి ఆకాంక్షలకు తగినట్లే భాగవత సప్తాహాలను, 18 రోజుల భారత హరికథా కాలక్షేపాలనూ, ఆపైన నవహ్నిక శ్రీరామయణ ప్రవచనాలను ఏర్పాటు చేస్తోందని పేర్కొంటూ, దీనికి అండదండలందిస్తున్న శ్రోతలకు కృతజ్ఞతలు తెలిపారు.

ప్రస్తుతం భారతదేశంలోని హరికథాగాన కళలో అగ్రగణ్యులుగా సంభావించబడే ”హరికథా సామ్రాజ్య సార్వభౌమ” బిరుదాంకితులైన శ్రీకోటసచ్చిదానంద శాస్త్రి భాగవతార్‌ మహాభారతం ఇతివృత్తంగా సాంప్రదాయిక పద్ధతిలో 18 రోజుల పాటు హరికథా గానం చేస్తారని, ఇది జూలై 5వ తేదితో శుభ సమాప్తి అవుతుందని అన్నారు. తి.తి.దే.,వారి హరికథాగాన అమృతాస్వాధనానికి అందరినీ ఆహ్వానిస్తోంది.

ఈ సందర్భంగా వేదికను, భక్తులకు తగిన సౌకర్యాలను ఏర్పాటు చేయడం జరిగింది. హిందూ ధర్మప్రచార పరిషత్తు సిబ్బంది ఈ కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని తగిన ఏర్పాట్లు చేస్తున్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.