శ్వేతలో వైభవంగా మహన్యాసపూర్వక రుద్రాభిషేకం
శ్వేతలో వైభవంగా మహన్యాసపూర్వక రుద్రాభిషేకం
తిరుపతి, సెప్టెంబరు 27, 2013: వైదిక స్మార్థ ఆగమ అర్చకుల శిక్షణ తరగతుల్లో భాగంగా తిరుపతిలోని శ్వేత భవనంలో శుక్రవారం మహన్యాసపూర్వక రుద్రాభిషేకం ఘనంగా నిర్వహించారు. తితిదే కార్యనిర్వహణాధికారి శ్రీ ఎం.జి.గోపాల్ సతీసమేతంగా పాల్గొని పూజా కార్యక్రమాలు చేపట్టారు.
ఈ సందర్భంగా తితిదే ఈవో మాట్లాడుతూ అర్చకుల సామర్థ్యాన్ని పెంచేందుకు శ్వేతలో క్రమం తప్పకుండా శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ తరగతుల్లో పండితుల ఉపన్యాసాలతోపాటు ప్రాక్టికల్స్ కూడా చేయిస్తున్నట్టు చెప్పారు. ప్రాక్టికల్స్‌లో భాగంగా ఆరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని మహన్యాసపూర్వక రుద్రాభిషేకం నిర్వహించినట్టు వివరించారు. సీనియర్ పండితుల ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఇప్పటితరం అర్చకులకు విధివిధానాలు తెలుస్తాయన్నారు. ఇక్కడ శిక్షణ పొందిన అర్చకులు నేర్చుకున్న విషయాలను తమ తమ ప్రాంతాలకు వెళ్లి మిగిలిన అర్చకులకు శిక్షణ ఇవ్వాలని కోరారు. పరమేశ్వరునికి రుద్రాభిషేకం వల్ల ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయని, పాడిపంటలు సమృద్ధిగా ఉంటాయని ఈవో వెల్లడించారు.
రుద్రాభిషేకంలో ముందుగా సంకల్పం, గణపతిపూజ, మహన్యాస మంత్రపఠనం, పంచామృత రుద్రాభిషేకం, నీరాజన మంత్రపుష్పం, తీర్థప్రసాద వినియోగం, మహదాశీర్వచనం ఘట్టాలు నిర్వహించారు. ఈ సందర్భంగా సీనియర్ అర్చకులు శ్రీ కౌతరపు వెంకటసుబ్రమణ్యం, శ్రీ కైతేపల్లి బాలసుబ్రమణ్యం, శ్రీ పెద్దింటి సుబ్బారాయుడుశాస్త్రి, శ్రీ శంకరమంచి శాంతిబాబు, శ్రీ రావూరి చిట్టివీర సుబ్రమణ్యశాస్త్రిలను శాలువ, శ్రీవారి ప్రసాదం, చిత్రపటంతో ఈవో సన్మానించారు.
తి.తి.దే ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.