DEVOTIONAL CULTURAL PROGRAMS IMPRESS DEVOTEES _ సర్వ విద్యా ప్రదాత హనుమంతుడు :శ్రీశ్రీశ్రీ సువిద్యేంద్ర తీర్థ స్వామి
సర్వ విద్యా ప్రదాత హనుమంతుడు :శ్రీశ్రీశ్రీ సువిద్యేంద్ర తీర్థ స్వామి
హనుమజ్జయంతినాడు ఆకట్టుకున్న భక్తి సంగీత కార్యక్రమాలు
తిరుమల, 2024 జూన్ 01: హనుమంతుడు సర్వ విద్య ప్రదాత అని బెంగుళూరు రాఘవేంద్ర స్వామి మఠాధిపతి శ్రీశ్రీశ్రీ సువిద్యేంద్ర తీర్థ స్వామి పేర్కొన్నారు.
హనుమజ్జయంతిని పురస్కరించుకుని శనివారం తిరుమలలోని నాదనీరాజనం, ఆకాశగంగ, జపాలి తీర్థంలో నిర్వహించిన భక్తి సంగీత కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
ఈ సందర్భంగా శ్రీశ్రీశ్రీ సువిద్యేంద్ర తీర్థ స్వామిజి అనుగ్రహ భాషణం చేస్తూ, పరమాత్ముడైన శ్రీమహావిష్ణువు సకల విద్యలను సూర్యుడికి బోధించాడని, సూర్యుడు సకల విద్యలను హనుమంతుడికి బోధించినట్లు తెలిపారు హనుమంతుని సేవిస్తే సత్ప్రవర్తన, ధైర్యం యశస్సు , విజయం సిద్ధిస్తుందని స్వామీజీ చెప్పారు. హనుమంతుడు తిరుమలలో జన్మించి, బాల్యంలోనే సూర్యుని పండుగ భావించి తినబోయిన డైరీ సాలి అన్నారు. రామ రావణ యుద్ధంలో సంజీవిని తెచ్చేందుకు హనుమంతుడిని మాత్రమే శ్రీరాముడు పంపినట్లు తెలిపారు. అందుకు కారణం స్వయంప్రకాశాలైన సంజీవినిని గుర్తించేందుకు తెచ్చేందుకు సూర్య విద్య తెలిసి ఉండాలని అది ఒక హనుమంతుడికి మాత్రమే తెలుసునని వివరించారు.
అనంతరం ఎస్వీ ఉన్నత వేదాధ్యయన సంస్థ ప్రత్యేక అధికారి డాక్టర్ విభీషణ శర్మ స్వామీజీని శాలువ శ్రీవారి ప్రసాదాలతో సత్కరించారు.
ఆకాశగంగలో…..
ఆకాశగంగలోని శ్రీ బాలాంజనేయస్వామివారి ఆలయం వద్ద శనివారం ఉదయం 10 నుండి 11.30 గంటల వరకు జాతీయ సంస్కృత విశ్వ విద్యాలయం అధ్యాపకులు ఆచార్య రాఘవాచార్యులు హనుమంతుని జన్మ విశేషాలు తెలిపారు.
జపాలి క్షేత్రంలో….
జాపాలి క్షేత్రంలో టిటిడి దాససాహిత్య ప్రాజెక్టు ప్రత్యేకాధికారి శ్రీ పి.ఆర్.ఆనంద తీర్థాచార్యులు ఆధ్వర్యంలో కళాకారులు ఉదయం 8 నుంచి 9.30 గంటల వరకు హనుమాన్ చాలీసా పఠించారు. ఉదయం 9.30 నుండి 10.30 గంటల వరకు తిరుపతికి చెందన శ్రీ సురేష్ భాగవతార్ హరికథ గానం చేశారు. ఉదయం ఎస్వీ సంగీత, నృత్య కళాశాల అధ్యాపకురాలు శ్రీ సురేష్, శ్రీ సుధాకర్ బృందం ఉదయం 10.30 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ” రామ రామ జయ జయ రామ…., శ్రీరామదూత హనుమంత….., మంగాంబుది హనుమంత…., రామ భక్తి సామ్రాజ్యం….” తదితర కీర్తనలను సుమధురంగా ఆలపించారు.
అనంతరం మధ్యాహ్నం 2 నుండి 3 గంటల వరకు తిరుపతికి చెందిన శ్రీ ప్రసన్న లక్ష్మీ బృందం హనుమాన్ చాలీసా పఠించారు. సాయంత్రం 4 నుండి 5 గంటల వరకు అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారిణి శ్రీమతి రమ్య క్రిష్ణ హరికథ గానం చేశారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.