HANUMA JAYANTI AT SRI KRT _ శ్రీ కోదండరామ స్వామి ఆలయంలో ఘనంగా హనుమజ్జయంతి
శ్రీ కోదండరామ స్వామి ఆలయంలో ఘనంగా హనుమజ్జయంతి
తిరుపతి, 2024 జూన్ 01: తిరుపతి శ్రీ కోదండరామస్వామివారి ఆలయానికి ఎదురుగావున్న శ్రీ ఆంజనేయస్వామివారి ఆలయంలో శనివారం హనుమజ్జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి.
ఈ సందర్భంగా ఉదయం 7 గంటలకు శ్రీ సీతారామలక్ష్మణస్వామి ఉత్సవమూర్తులను శ్రీ ఆంజనేయస్వామివారి ఆలయానికి వేంచేపు చేశారు. శ్రీ ఆంజనేయస్వామివారి మూలవర్లకు, శ్రీసీతారామ, లక్ష్మణ స్వామివార్ల ఉత్సవర్లకు వైభవంగా అభిషేకం నిర్వహించారు. రాత్రి 7 నుండి 8.30 గంటల వరకు శ్రీ రామచంద్రమూర్తి హనుమంత వాహనంపై విహరించనున్నారు.
హనుమంతుడు తనను సేవించే భక్తులకు ఆత్మోన్నతిని ప్రసాదిస్తున్నాడు. శ్రీ వైష్ణవ సాంప్రదాయంలో హనుమద్వాహన సేవను సిరియ తిరువడిగా కీర్తిస్తారు. దాస్యభక్తికి ప్రతీకగా శ్రీరాములవారు హనుమంత వాహనంపై విహరిస్తారు.
ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి నాగరత్న, ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ ఆనంద్‌కుమార్ దీక్షితులు, సూపరింటెండెంట్ శ్రీ సోమ శేఖర్, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.