సహస్రదీపాలంకార సేవలో శ్రీరాముని అలంకారంలో శ్రీనివాసుని కటాక్షం- భక్తుల తన్మయత్వం

సహస్రదీపాలంకార సేవలో శ్రీరాముని అలంకారంలో శ్రీనివాసుని కటాక్షం
 
– భక్తుల తన్మయత్వం
 
హైదరాబాద్, 2022 అక్టోబరు 11: హైదరాబాద్ లో టిటిడి నిర్వహిస్తున్న శ్రీవేంకటేశ్వర వైభవోత్సవాల్లో మొదటి రోజు మంగళవారం సాయంత్రం సహస్రదీపాలంకార సేవలో ధనుర్భాణాలతో శ్రీరాముని అలంకారంలో  శ్రీనివాసుడు భక్తులను కటాక్షించారు. భక్తులు స్వామివారి వైభవాన్ని దర్శించి తన్మయత్వం చెందారు. చల్లటి సాయంత్రం వేళ ఆహ్లాదకర వాతావరణంలో స్వామివారు ఉల్లాసంగా ఊయలలో ఊగుతూ భక్తులకు కనువిందు చేశారు. నిత్యం అవిశ్రాంతంగా భక్తులకు దర్శనభాగ్యాన్ని ప్రసాదించే స్వామివారు సహస్రదీపాలంకార సేవతో సేద తీరుతారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ హరీశ్ రావు పాల్గొన్నారు.
 
ముందుగా వేద పండితులు చతుర్వేద పారాయణం చేశారు. ఆ తరువాత  టిటిడి అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు శ్రీ బి.రఘునాథ్ బృందం అన్నమయ్య సంకీర్తనలను రసరమ్యంగా ఆలపించారు. ఇందులో ‘ రామచంద్రుడితడు రఘువీరుడు…’, ‘వీడివో అల విజయరాఘవుడు…’, ‘రాముడు రాఘవుడు…’ తదితర కీర్తనలున్నాయి. ఆ తరువాత మంగళవాయిద్యంతో వాద్యనీరాజనం సమర్పించారు.
 
సాయంత్రం 6.30 నుంచి రాత్రి 7.30 గంటల వరకు వేదిక చుట్టూ స్వామివారు తిరుచ్చిపై ఊరేగి భక్తులకు దర్శనమిచ్చారు. రాత్రి 7.30 నుంచి 8.30 గంటల వరకు రాత్రి కైంకర్యాలు నిర్వహిస్తారు. రాత్రి 8.30 నుంచి 9 గంటల వరకు ఏకాంతసేవ జరుగనుంది.
 
కాగా, మంగళవారం నాడు పలు పాఠశాలల విద్యార్థులు నమూనా ఆలయంలో స్వామివారిని దర్శించుకున్నారు.
 
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.