ANNAMACHARYA REDEFINED TELUGU _ అచ్చ తెలుగు పదం అన్నమయ్య సొంతం – ఆచార్య చంద్ర‌శేఖ‌ర్‌రెడ్డి

TIRUPATI, 07 APRIL 2024: Annamacharya has redefined Telugu penning thousands of Sankeertans in local slang to spread Sri Venkateswara Bhakti among common people, said scholars during the literary summit.

As part of the 521st Annamacharya Vardhanti fete, during the literary program held at Annamacharya Kalamandiram on Sunday in Tirupati.

Retired Professor of SV University Sri Chandrasekhar Reddy spoke on Annamaiah Bhasha Soundaryam while Dr Naga Rajyalakshmi retired professor from Guntur Government Degree College delivered lecture on Alankarams in Annamaiah Sankeertans and renowned scholar from Hyderabad Sri Sankar Rao given talk on Annamaiah Keertanalu Parishkarana.

In the evening Vijayawada artists will present Nrityanjali

In the morning renowned Annamacharya Project Artist Smt Bullemma presented melodious Sankeertans.

Project Director Dr Vibhishana Sharma and others were present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

అచ్చ తెలుగు పదం అన్నమయ్య సొంతం – ఆచార్య చంద్ర‌శేఖ‌ర్‌రెడ్డి

తిరుపతి, 2024 ఏప్రిల్ 07: శ్రీ తాళ్లపాక అన్నమయ్య ఆనాడు జనబాహుళ్యంలో ఉన్న అచ్చ తెలుగు పదాలతో తిరుమల శ్రీవారిపై వేలాది సంకీర్తనలు రచించారని టీటీడీ శ్రీ వేంక‌టేశ్వ‌ర క‌ల్యాణోత్స‌వ ప్రాజెక్టు ప్ర‌త్యేకాధికారి ఆచార్య చంద్ర‌శేఖ‌ర్‌రెడ్డి పేర్కొన్నారు. శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 521వ వర్ధంతి ఉత్సవాల్లో భాగంగా తిరుపతిలోని అన్నమాచార్య కళా మందిరంలో నిర్వహిస్తున్న సాహితీ సదస్సులు ఆదివారం మూడో రోజుకు చేరుకున్నాయి.

ఈ సందర్భంగా నిర్వహించిన సాహితీ సదస్సుకు అధ్యక్షత వహించిన ఆచార్య చంద్ర‌శేఖ‌ర్‌రెడ్డి “అన్నమయ్య – బాషా సౌంద‌ర్యం ” అనే అంశంపై ఉపన్యసించారు. ఆనాడు పండితుల భాషగా ఉన్న సంస్కృతాంధ్ర పదాలను కాకుండా, సాధారణ జనం మాట్లాడే భాషతో, రాయలసీమలోని మాండలికాలతో కీర్తనలు రచించినట్టు చెప్పారు. దీన్ని బట్టి అన్నమయ్యను వ్యవహారిక భాషోద్యమానికి ఆద్యుడని భావించవచ్చన్నారు. అన్నమాచార్యులు తెలుగు పద సాహిత్యానికి ఆద్యుడని, ఆయన పద సంపదను భావితరాలకు అందించాలన్నారు.

గుంటూరు ప్ర‌భుత్వ డిగ్రీ క‌ళాశాల విశ్రాంత ఆచార్యులు డా.నాగ‌రాజ్య‌ల‌క్ష్మీ “అన్నమయ్య కీర్త‌న‌లలో అలంకారాలు ” అనే అంశంపై ఉపన్యసిస్తూ, అన్నమయ్య అలంకారాలను 12 రాశులకు ప్రతీకగా విభజించవచ్చని, పద్యానికి – పదానికి సమాన గౌరవం ఇచ్చినట్లు తెలిపారు. అన్నమయ్య వాగ్గేయకారులకు, కవులకు భాషా సందేశం, కీర్తనలు, కీర్తన అంశాల విధాన సందేశం, తాత్విక, సంగీత సందేశం ఇచ్చినట్లు చెప్పారు. ఆడవారికి అలంకరణలు ఎలా శోభను ఇస్తాయో, సంకీర్తనల్లో అలంకారాలు అలా శోభ నిస్తాయని తెలిపారు. సంస్కృతం, తెలుగులో ఏ కవి తమ కవిత్వంలో ఆలంకరాలతో వర్ణించలేదని, ఒక్క అన్నమయ్య మాత్రమే తన పద కవిత్వంలో అలంకారాలు ఉపయోగించినట్లు వివరించారు.

హైద‌రాబాద్‌కు చెందిన ప్ర‌ముఖ సాహితీ వేత్త శ్రీ శంక‌ర్ రావు “అన్నమయ్య కీర్త‌న‌లు – ప‌రిష్క‌ర‌ణ ” అనే అంశంపై ఉపన్యసిస్తూ, అన్నమయ్య సాహిత్యాన్ని వేటూరి ప్రభాకర శాస్త్రి, సాధు సుబ్రహ్మణ్య శాస్త్రి, రాళ్ళపల్లి అనంత కృష్ణ శర్మ, గౌరిపెద్ది రామ సుబ్బశర్మ, డాక్టర్ జగన్నాథ్ రావు తదితరులు రాగిరేకుల్లోని అన్నమయ్య సాహిత్యాన్ని పరిష్కరించి, నేటి గాయకులు పాడుకునే విధంగా అందించినట్లు చెప్పారు. 15వ శతాబ్దం నాటి సాహిత్యాన్ని పరిష్కరించాలంటే, ఆనాటి సాహిత్య చరిత్ర, సంకీర్తనలు పట్టు, అవగాహన ఉండాలన్నారు. కవికి గాయకుడికి పరిష్కార కర్త వారధి లాంటి వారిని వివరించారు.

సాయంత్రం 6 నుండి 8 గంట‌ల వ‌ర‌కు విజ‌య‌వాడ‌కు చెందిన శ్రీ‌నృత్య క‌ళాంజ‌లివారిచే నృత్య రూప‌క ప్ర‌ద‌ర్శ‌న ఇవ్వ‌నున్నారు.

అంత‌కుముందు ఉద‌యం 9 గంట‌ల‌కు అన్న‌మాచార్య ప్రాజెక్టు క‌ళాకారులు శ్రీ‌మ‌తి బుల్లెమ్మ‌ బృందం సంగీత స‌భ నిర్వ‌హించారు.

ఈ కార్యక్రమంలో అన్న‌మాచార్య ప్రాజెక్టు సంచాలకులు డాక్టర్ ఆకెళ్ల విభీషణ శర్మ, పుర ప్ర‌జ‌లు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య‌ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.