అన్నమయ్య సంకీర్తనల్లో వేద విజ్ఞానం : శంకరరావు

అన్నమయ్య సంకీర్తనల్లో వేద విజ్ఞానం : శంకరరావు

తిరుపతి, మే 25, 2013: శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల సంకీర్తనల్లో వేద విజ్ఞానం ఇమిడి ఉందని చెన్నైకి చెందిన  మద్రాసు వర్సిటీ తెలుగు శాఖ అధ్యాపకులు డాక్టర్‌ వి.శంకరరావు పేర్కొన్నారు. అన్నమయ్య 605వ జయంతి ఉత్సవాల్లో భాగంగా తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో నిర్వహిస్తున్న సాహితీ సదస్సులు శనివారం రెండో రోజుకు చేరుకున్నాయి.
 
ఇందులో భాగంగా డాక్టర్‌ వి.శంకరరావు ‘అన్నమయ్య సంకీర్తనల్లోని విష్ణుభక్తి – విశేషాంశాలు’ అనే అంశంపై ఉపన్యసిస్తూ శరణాగతి, లోకనీతి, వేదాల్లోని సారాన్ని కలిపి అన్నమయ్య తన సాహిత్యాన్ని సృష్టించారని వివరించారు. యావత్‌ భక్తి సాహిత్యంలో అన్నమయ్యకు ప్రత్యేకమైన స్థానం ఉందన్నారు. అన్ని మంత్రాల సారం శ్రీ వేంకటేశ్వర మంత్రంలో ఉందంటూ స్వామివారిపై ఎనలేని భక్తిని చాటారని ఆయన పేర్కొన్నారు. అన్నమయ్య సంకీర్తనల్లో శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, హనుమంతుడు తదితర దేవతలకు ప్రాధాన్యం కల్పించారని వివరించారు.
 
అనంతరం మైసూరుకు చెందిన డాక్టర్‌ ఆర్‌.వి.ఎస్‌.సుందరం ‘ప్రపంచ సాహిత్యంలో అన్నమయ్య స్థానం’ అనే అంశంపై, బెంగళూరుకు చెందిన డాక్టర్‌ జి.ఎస్‌.మోహన్‌ ‘తాళ్లపాక కవులు – కర్ణాటక హరిదాసులు’ అనే అంశంపై, విశాఖపట్టణానికి చెందిన డాక్టర్‌ వారణాశి వేంకటేశ్వర శర్మ ‘అన్నమయ్య వేదాంత తత్త్వం’ అనే అంశంపై ఉపన్యసించారు.
 
సాయంత్రం 6.00 నుండి 7.15 గంటల వరకు తిరుపతికి చెందిన శ్రీ బి.రఘునాథ్‌, శ్రీ జి.మధుసూదనరావు, శ్రీ ఎం.పి.రమేష్‌, శ్రీమతి ఆర్‌.సుశీల, శ్రీమతి కె.విశాలాక్షి, శ్రీమతి ఆర్‌.బుల్లెమ్మ గాత్ర సంగీత సభ, రాత్రి 7.30 నుండి 9.00 గంటల వరకు మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ ప్రాజెక్టు ఆధ్వర్యంలో సంగీత కార్యక్రమాలు జరుగనున్నాయి.
తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో సాయంత్రం 5.00 నుండి 6.00 గంటల వరకు తితిదేలో టెక్నికల్‌ ఆఫీసర్‌గా పనిచేస్తున్న శ్రీ సిహెచ్‌.బాలసుబ్రహ్మణ్యం సంగీత సభ, రాత్రి 6.15 నుండి 7.15 గంటల వరకు తిరుపతికి చెందిన తితిదే ఆస్థాన విద్వాంసులు శ్రీ జి.బాలకృష్ణప్రసాద్‌ సంగీత సభ, రాత్రి 7.30 నుండి రాత్రి 9.00 గంటల వరకు తెనాలికి చెందిన శ్రీమతి బాలత్రిపురసుందరి నృత్య కార్యక్రమాలు జరుగనున్నాయి.
తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆస్థానమండపంలో సాయంత్రం 5.00 నుండి 6.15 గంటల వరకు ఐరాలకు చెందిన శ్రీ పి.కన్నయ్య బృందం సంగీత సభ, సాయంత్రం 6.30 నుండి రాత్రి 8.00 గంటల వరకు నెల్లూరుకు చెందిన శ్రీ డి.వి.సురేష్‌రావు, కుమారి డి.వి.సుష్మ  బృందం సంగీత సభ నిర్వహించనున్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.