ఘనంగా శ్రీ పద్మావతి అమ్మవారి వసంతోత్సవాలు ప్రారంభం

ఘనంగా శ్రీ పద్మావతి అమ్మవారి వసంతోత్సవాలు ప్రారంభం

తిరుపతి, మే 24, 2013: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక వసంతోత్సవాలు శుక్రవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి సహస్రనామార్చన, మూలవర్లకు అభిషేకం నిర్వహించారు. మధ్యాహ్నం 2.00 గంటలకు అమ్మవారి ఉత్సవర్లను ఆలయం నుండి శుక్రవారపు తోటకు ఊరేగింపుగా తీసుకెళ్లారు. అనంతరం అక్కడ స్నపనతిరుమంజనం నిర్వహించారు. ఇందులో భాగంగా పసుపు, కుంకుమ, పాలు, పెరుగు, తేనె, చందనం, పలురకాల పండ్లరసాలతో అభిషేకం చేశారు. సాయంత్రం 6.30 నుండి 7.30 గంటల వరకు అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక సంగీత కార్యక్రమాలు నిర్వహించనున్నారు. రాత్రి 7.30 నుండి 8.30 గంటల వరకు ఉత్సవమూర్తులను ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగించనున్నారు.
కాగా మే 25వ తేదీ ఉదయం 7.00 గంటలకు స్వర్ణ రథోత్సవం కన్నుల పండువగా జరుగనుంది. గృహస్త భక్తులు రూ.300/- చెల్లించి వసంతోత్సవంలో పాల్గొనవచ్చు. ఈ సేవలో పాల్గొన్న గృహస్తులకు ఒక ఉత్తరీయం, ఒర రవికె, రెండు లడ్డూలు బహుమానంగా అందజేయనున్నారు. వసంతోత్సవం సందర్భంగా ఆలయంలో మూడు రోజుల పాటు ఆర్జిత సేవలైన లక్ష్మీపూజ,కల్యాణోత్సవం, ఊంజలసేవను రద్దు చేశారు.
ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ భాస్కర్‌రెడ్డి, ఏఈఓ శ్రీమతి నాగరత్నం, సూపరింటెండెంట్‌ శ్రీ శేషగిరి, ఆర్జితం ఇన్‌స్పెక్టర్‌ శ్రీ వెంకటరమణారెడ్డి ఇతర అధికార ప్రముఖులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
            ———————————————————————
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.