అష్టోత్తర శతకుండాత్మక అద్భుత మహాశాంతియాగం

  అష్టోత్తర శతకుండాత్మక అద్భుత మహాశాంతియాగం

తిరుపతి, జనవరి – 30, 2010: ప్రపంచ ప్రజలందరి శుభాన్ని కోరి 108 అగ్నికుండాలతో ధర్మప్రచారపరిషత్‌ ద్వారా తిరుమల తిరుపతి దేవస్థానములవారు శ్రీనివాసమంగాపురంలో నిర్వహిస్తున్న వైఖానస ఆగమోక్త అష్టోత్తర శత కుండాత్మక అద్భుత మహాశాంతి యాగ త్రయాహ్నిక దీక్షలో ద్వితీయాహ్నిక శుభోదయాన యజ్ఞ నారాయణునికి పూజాదికాలు ప్రారంభమయ్యాయి.

 శ్రీవేంకటేశ్వరుని దివ్యరూపాలను దివ్య మహిమలను స్తుతిస్తూ సర్వజనావళికి క్షేమ సౌఖ్యాలను సంకల్పిస్తూ తథాస్తు మంత్రాలతో స్వామివారికి ప్రధాన కుంభారాధనం జరిగింది.
ప్రతినిత్యంలాగే ఉదయకాలంలో దేవసేనాధిపతి అయిన విష్వక్సేనుని పూజానంతరం స్వామివారి ముందు పుణ్యాహవాచనం చోటు చేసుకుంది.

యాగంలో అగ్ని ప్రతిష్ఠాపనం జరిగింది. 108 హోమకుండాలలో హవిస్సును అర్పిస్తూ శాంతి మంత్రాలు ప్రారంభించారు ఋత్విక్కులు. యాగానంతరం స్వామివారికి స్నపన తిరుమంజనం జరిగింది.

సాయంకాలం యాథావిధిగా విష్ణుసహస్రనామస్తోత్రం నిర్వహింపబడుతూంది. అనంతరం వివిధ ప్రాంతాల నుండి వచ్చిన 150 మంది వైఖానసపండిత శ్రేష్ఠులతో ఈమహాశాంతియాగం నిర్విఘ్నంగా రెండవ రోజుకు చేరుకుంది.

దేవస్థానం కార్యనిర్వహణాధికారి, ధర్మప్రచారపరిషత్‌ కార్యదర్శి తదితర దేవస్థానం అధికారుల పర్యవేక్షణతో సర్వదేవతాప్రీతికరమైన యాగం కొనసాగుతోంది.

ఈ అష్టోత్తరశతకుండాత్మక యాగం త్రయాహ్నిక దీక్షలో చివరి రోజు 3వ నాడు 31-01-2010 ఉదయం యథావిదిగా కొనసాగిన కార్యక్రమాల అనంతరం 11.30 గంటలకు పూర్ణాహుతి కార్యక్రమం నిర్వహింపబడుతుంది.

రాష్ట్ర ప్రజలకు, దేశ ప్రజలకు సుఖశాంతులు సిద్ధించాలనే ఉన్నత ఆశయంతో ఈ శాంతి యాగాన్ని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి శ్రీ కొణిజేటి రోశయ్య గారు, దేవాదాయశాఖామాత్యులు శ్రీ గాదె వెంకటరెడ్డిగారు, పాలకమండలి అధ్యకక్షులు శ్రీ డి.కె. ఆదికేశవులు గారు, కార్యనిర్వహణాధికారి శ్రీ ఐ.వై.ఆర్‌. కృష్ణారావు గారు, ఇతర పాలక మండలి సభ్యులు, తితిదే ఉన్నతాధికారులు తదితర  సందర్శించుకున్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.