ఆగస్టు 21న ‘మనగుడి’కి రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాట్లు పూర్తి

ఆగస్టు 21న ‘మనగుడి’కి రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాట్లు పూర్తి

తిరుపతి, ఆగస్టు 20, 2013: ఆగస్టు 21న శ్రావణపౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని తితిదే, రాష్ట్ర దేవాదాయ శాఖ సంయుక్తంగా రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించనున్న మూడో విడత మనగుడి కార్యక్రమానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి.

మనగుడి కార్యక్రమం నిర్వహించేందుకు అవసరమైన కంకణాలు, పూజాసామగ్రి ఇప్పటికే ఆయా ఆలయాలకు తితిదే చేరవేసింది. అన్నిచోట్లా స్థానికులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఆలయాలను శుభ్రం చేసుకుని తోరణాలు కట్టి రంగవల్లులు తీర్చిదిద్దారు. మనగుడి కార్యక్రమంలోని ఆలయాల్లో ఉదయం 5.00 నుండి 10.00 గంటల వరకు అభిషేకం, అర్చనలు, పూజాధికాలు నిర్వహిస్తారు. ఆ సమయంలోనే సామూహిక పారాయణం కూడా జరుగుతుంది. ఉదయం 11.00 గంటలకు ప్రసాద వితరణ చేస్తారు. సాయంత్రం 4.00 గంటలకు పురాణ ప్రవచనం ఉంటుంది. సాయంత్రం 6.00 గంటలకు హరికథాపారాయణం చేస్తారు. అనంతరం మనగుడి ప్రతిజ్ఞతో కార్యక్రమం సమాప్తం అవుతుంది. బుధవారం రాఖీ పౌర్ణమి కూడా కావడంతో అన్నాచెల్లెళ్లు ఆలయంలో కంకణధారణ కూడా చేసుకోవచ్చు. వచ్చిన భక్తులందరికీ ఆలయాల్లో కంకణాలు, మహిళలకు పసుపుకుంకుమ అందజేస్తారు.
              
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.