PUSHPAYAGAM IN EKANTAM _ ఏప్రిల్ 6న ఏకాంతంగా శ్రీ కల్యాణవేంకటేశ్వరస్వామివారి ఆలయంలో పుష్పయాగం

Tirupati, 3 Apr. 21: The annual Pushayagam in Sri Kalyana Venkateswara Swamy temple at Srinivasa Mangapuram will be observed on April 6 in Ekantam in view of Covid guidelines. 

In view of this ritual Kalyanotsavam is cancelled on that day.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI 

ఏప్రిల్ 6న ఏకాంతంగా శ్రీ కల్యాణవేంకటేశ్వరస్వామివారి ఆలయంలో పుష్పయాగం

 తిరుప‌తి, 2021 ఏప్రిల్ 03: శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ఏప్రిల్ 6న పుష్పయాగం జరుగనుంది. తిరుమల శ్రీవారి ఆలయం త‌ర‌హాలో ఇక్కడ పుష్పయాగం నిర్వహిస్తారు. కోవిడ్-19 వ్యాప్తి నేప‌థ్యంలో ఈ ఉత్స‌వాన్ని ఆల‌యంలో ఏకాంతంగా చేప‌డ‌తారు.

ఆల‌యంలో మార్చి 2  నుండి 10వ తేదీ వ‌ర‌కు బ్రహ్మోత్సవాలు జరిగిన విషయం తెలిసిందే. ఈ బ్రహ్మోత్సవాల్లో అర్చక పరిచారకుల వల్ల, అధికార అనధికారుల వల్ల, భక్తుల వల్ల ఏవైనా లోపాలు జరిగి ఉంటే వాటికి ప్రాయశ్చిత్తంగా పుష్పయాగం నిర్వహిస్తారు. ఈ యాగం నిర్వహణ వల్ల సమస్తదోషాలు తొలగిపోతాయని అర్చకులు తెలిపారు.

ఇందుకోసం ఏప్రిల్ 5న సాయంత్రం 6 నుండి 8 గంటల వరకు పుణ్యాహ‌వ‌చ‌నం, మృత్సంగ్ర‌హ‌ణం, సేనాధిప‌తి ఉత్స‌వం, అంకురార్పణం జరుగనుంది.

ఏప్రిల్ 6న  ఉదయం 10 నుండి 11 గంటల వరకు శ్రీదేవి భూదేవి సమేత కల్యాణ వేంకటేశ్వరస్వామి వారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. ఇందులో పాలు, పెరుగు, తేనె,  పసుపు, చందనం, కొబ్బరినీళ్ల‌తో అభిషేకం చేస్తారు. మధ్యాహ్నం 2.30 నుండి 4.30 గంటల వరకు పుష్పయాగం జరుగనుంది. ఇందులో తులసి, చామంతి, గన్నేరు, మొగలి, మల్లె, జాజి సంపంగి, రోజా, కలువలు వంటి పలురకాల పుష్పాలతో స్వామివారికి అభిషేకం చేస్తారు.

శ్రీవారి పుష్పయాగాన్ని పురస్కరించుకుని ఏప్రిల్ 6న నిత్య కల్యాణోత్సవం సేవను టిటిడి రద్దు చేసింది.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.