కుమారస్వామి, వెంకటరత్నం సేవలు మరువలేనివి

కుమారస్వామి, వెంకటరత్నం సేవలు మరువలేనివి

తిరుపతి, జనవరి 31, 2013: తితిదే ముఖ్య వైద్యాధికారి శ్రీ కుమారస్వామి, పే అండ్‌ అకౌంట్స్‌ విభాగం ఉప కార్యనిర్వహణాధికారి శ్రీ వెంకటరత్నం సేవలు మరువలేనివని తితిదే అధికారులు కొనియాడారు. ముఖ్య వైద్యాధికారి శ్రీ కుమారస్వామి పదవీ విరమణ సందర్భంగా తితిదే పరిపాలనా భవనంలోని కేంద్రీయ వైద్యశాలలో గురువారం ఘనంగా వీడ్కోలు సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రత్యేకశ్రేణి ఉపకార్యనిర్వహణాధికారి(జనరల్‌) శ్రీ టి.ఏ.పి.నారాయణ ప్రసంగిస్తూ శ్రీవారి బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశి లాంటి పర్వదినాల్లో తిరుమలకు అధిక సంఖ్యలో వచ్చే భక్తులకు మెరుగైన వైద్యసేవలందించేందుకు కుమారస్వామి విశేష కృషి చేశారని వెల్లడించారు. ఉద్యోగులు, పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యులకు వైద్య సేవలందించేందుకు నిరంతరం అందుబాటులో ఉంటూ అందరి అభిమానాన్ని చూరగొన్నారని పేర్కొన్నారు.
అనంతరం శ్రీ కుమారస్వామిని తితిదే అధికారులు, వైద్యశాల వైద్యులు శాలువలు, పూలమాలలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సీనియర్‌ మెడికల్‌ ఆఫీసర్‌ శ్రీ శ్రీరామమూర్తి, రిటైర్డ్‌ డెప్యూటీ ఈఓ శ్రీ ప్రభాకర్‌రెడ్డి, ఇతర వైద్యులు, అధికారులు పాల్గొన్నారు.
అదేవిధంగా తితిదే పరిపాలనా భవనం ప్రాంగణంలో పే అండ్‌ అకౌంట్స్‌ విభాగం ఉప కార్యనిర్వహణాధికారి శ్రీ వెంకటరత్నం పదవీ విరమణ సన్మాన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఉద్యోగులకు సంబంధించిన జమాఖర్చులను పక్కాగా నిర్వహించేందుకు శ్రీ వెంకటరత్నం విశేష కృషి చేశారని పేర్కొన్నారు. అనంతరం తితిదే అధికారులు, ఉద్యోగులు శ్రీ వెంకటరత్నంను శాలువలు, పూలమాలలతో ఘనంగా సన్మానించారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.