ELABORATE ARRANGEMENTS FOR CHAKRASNANAM _ చక్రస్నానానికి పటిష్ట ఏర్పాట్లు
SAFETY AND COMFORT OF DEVOTEES TOP PRIORITY – ADDITIONAL EO
Tirumala, 22 September 2026: TTD Additional EO Sri Ch. Venkaiah Chowdary inspected Chakrasnanam arrangements at Srivari Pushkarini on Tuesday ahead of the September 23 event, the final day of Salakatla Brahmotsavam.
He directed officials concerned to ensure orderly crowd movement, smooth entry and exit, and full coordination among TTD, vigilance and police teams.
Chakrasnanam will be performed between 6 am and 9 am on September 23.
He said devotees shall take a holy dip in a phased manner in the holy waters of Swamy Pushkarini throughout the day as the sanctity lasts the entire day through designated gates, maintaining discipline.
Crowd control will be managed in phases from galleries, with NDRF, fire, swimming teams and boats on standby.
LED screens will be installed for easy viewing.
A review meeting was also held with JEOs, CVSO, SP and other senior officers at Vaibhavotsava Mandapam.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICE
చక్రస్నానానికి పటిష్ట ఏర్పాట్లు
భక్తుల భద్రత, సౌకర్యానికి అత్యంత ప్రాధాన్యత – అదనపు ఈవో
సమన్వయంతో విధులు నిర్వహించాలని అధికారులకు ఆదేశం
తిరుమల, 2026 సెప్టెంబరు 22: తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన సెప్టెంబరు 23న వైభవంగా నిర్వహించనున్న చక్రస్నానం సందర్భంగా శ్రీవారి పుష్కరిణిలో టీటీడీ అదనపు ఈవో శ్రీ సిహెచ్. వెంకయ్య చౌదరి మంగళవారం ఏర్పాట్లను పరిశీలించారు. పుష్కరిణి పరిసరాలను క్షుణ్ణంగా తనిఖీ చేసి, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చేపట్టాల్సిన చర్యలపై అధికారులకు పలు సూచనలు చేశారు.
క్రమపద్ధతిలో భక్తులకు ప్రవేశం
భక్తులు పుష్కరిణిలోకి సులభంగా ప్రవేశించి, తిరిగి బయటకు వెళ్లేలా నిర్దేశిత ప్రాంతాల్లో గేట్లు ఏర్పాటు చేసినట్లు అదనపు ఈవో తెలిపారు. టీటీడీ అధికారులు, విజిలెన్స్, పోలీసు సిబ్బంది సమన్వయంతో విధులు నిర్వహిస్తూ భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు.
ఉదయం 6 నుంచి 9 గంటల వరకు చక్రస్నానం
సెప్టెంబరు 23న ఉదయం 6 నుంచి 9 గంటల మధ్య శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారి ఉత్సవమూర్తులకు, చక్రత్తాళ్వార్‌కు స్నపనతిరుమంజనం, చక్రస్నానం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ పవిత్ర ఘట్టాన్ని భక్తులు క్రమపద్ధతిలో వీక్షించేలా అవసరమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు.
పుష్కరిణిలో పవిత్ర స్నానానికి భక్తులకు అవకాశం
చక్రస్నానం రోజంతా పవిత్ర ఘడియలుగా భావించబడుతుందని, భక్తులు తమకు అనుకూలమైన సమయంలో పుష్కరిణిలో పవిత్ర స్నానం ఆచరించవచ్చని అదనపు ఈవో తెలిపారు. భక్తులు నిర్దేశించిన గేట్ల ద్వారానే ప్రవేశించి, సంయమనం పాటిస్తూ టీటీడీ సిబ్బందికి సహకరించాలని కోరారు.
రద్దీ నియంత్రణకు ప్రత్యేక చర్యలు
పుష్కరిణి చుట్టూ ఏర్పాటు చేసిన గ్యాలరీల్లోని భక్తులను దశలవారీగా పుష్కరిణిలోకి అనుమతించాలని అధికారులను ఆదేశించారు. భక్తుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని సూచించారు.
ఎన్‌డీఆర్‌ఎఫ్, అగ్నిమాపక, ఈతగాళ్ల బృందాలు సిద్ధం
పోలీసులు, టీటీడీ విజిలెన్స్ విభాగంతోపాటు ఎన్‌డీఆర్‌ఎఫ్, అగ్నిమాపక, ఈతగాళ్ల బృందాలను అందుబాటులో ఉంచి పటిష్ట భద్రతా చర్యలు చేపట్టినట్లు తెలిపారు.
అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు పుష్కరిణిలో ఈతగాళ్లు, బోటును సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు.
ఎల్‌ఈడీ స్క్రీన్ల ద్వారా చక్రస్నానం వీక్షణ
భక్తులు చక్రస్నాన మహోత్సవాన్ని సులభంగా వీక్షించేందుకు ఆలయ పరిసరాల్లో ఎల్‌ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేయాలని అదనపు ఈవో సూచించారు.
అంతకుముందు వైభవోత్సవ మండపంలో చక్రస్నానం ఏర్పాట్లపై టీటీడీలోని వివిధ విభాగాల అధికారులతో అదనపు ఈవో సమీక్ష నిర్వహించారు. భక్తుల సౌకర్యం, భద్రతకు సంబంధించి చేపట్టాల్సిన చర్యలపై అధికారులకు పలు సూచనలు చేశారు.
ఈ సమావేశంలో టీటీడీ జేఈవోలు డా. ఎ. శరత్, శ్రీ ప్రభల గోపీనాథ్, సీవీఎస్వో శ్రీ కేవీ మురళీకృష్ణ, జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు, సీఈ శ్రీ మనోహర్‌తో పాటు వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.







