జమ్మలమడుగు శ్రీ నారాపుర వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ప‌విత్రోత్స‌వాలు ప్రారంభం

జమ్మలమడుగు శ్రీ నారాపుర వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ప‌విత్రోత్స‌వాలు ప్రారంభం

 తిరుపతి, 2021 సెప్టెంబ‌రు 16: వైఎస్ఆర్ కడప జిల్లా జమ్మలమడుగు శ్రీ నారాపుర వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో పవిత్రోత్సవాలు గురువారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం స్వామివారిని సుప్రభాతంతో మేల్కొలిపి, తోమాలసేవ, సహస్రనామార్చన నిర్వహించారు. కోవిడ్ – 19 వ్యాప్తి నేప‌థ్యంలో ఆల‌యంలో ప‌విత్రోత్స‌వాలు ఏకాంతంగా నిర్వ‌హించారు.

ఉద‌యం 9 నుండి మ‌ధ్యాహ్నం 1 గంట వ‌ర‌కు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ నారాపుర వేంకటేశ్వరస్వామివారి ఉత్సవర్లను యాగశాలకు వేంచేపు చేసి చ‌తుష్టార్చాన‌, అగ్ని ప్ర‌తిష్ట‌, ప‌విత్ర ప్ర‌తిష్ట నిర్వ‌హించారు. సాయంత్రం 6 నుండి రాత్రి 8 గంటల వరకు ఆలయంలోని యాగశాలలో వైదిక కార్యక్రమాలు జ‌రుగ‌నున్నాయి.

కాగా సెప్టెంబరు 17న పవిత్ర సమర్పణ, సెప్టెంబరు 18న మహాపూర్ణాహుతి, సాయంత్రం 6 గంటలకు స్వామి, అమ్మవార్లను ఆల‌యంలో ఊరేగించ‌నున్నారు.

యాత్రీకుల వల్లగానీ, సిబ్బంది వల్ల గానీ తెలియక దోషాలు జరుగుతుంటాయి. వాటివల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా నివారించేందుకు ప్రతి ఏడాది మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ.

ఈ కార్య‌క్ర‌మంలో ఆల‌య ఏఈవో శ్రీ ముర‌ళీధ‌ర్, టెంపుల్ ఇన్‌స్పెక్ట‌ర్ శ్రీ మునికుమార్‌, ఆల‌య అర్చ‌కులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.