డాక్టర్‌ నూకల చినసత్యనారాయణ మృతికి తితిదే ఛైర్మన్‌, ఈవో సంతాపం

డాక్టర్‌ నూకల చినసత్యనారాయణ మృతికి తితిదే ఛైర్మన్‌, ఈవో సంతాపం

తిరుపతి, జూలై 11, 2013: ప్రముఖ సంగీత విద్వాంసులు, పద్మభూషణ్‌ అవార్డు గ్రహీత డాక్టర్‌ నూకల చినసత్య నారాయణ మృతికి తితిదే ధర్మకర్తల మండలి అధ్యకక్షులు శ్రీ కనుమూరి బాపిరాజు, కార్యనిర్వహణాధికారి శ్రీ ఎంజి.గోపాల్‌ గురువారం సంతాపం వ్యక్తం చేశారు.

శ్రీ నూకల చినసత్యనారాయణ 1991-94 మధ్య కాలంలో తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర సంగీత, నృత్య కళాశాల ప్రిన్సిపాల్‌గా వ్యవహరించారు. శ్రీ తాళ్లపాక అన్నమయ్య శ్రీవారిపై రచించిన పలు కీర్తనలను స్వరపరిచి సిడిలు రూపొందించారు. డాక్టర్‌ శ్రీపాద పినాకపాణి వద్ద  సంగీత విద్యను అభ్యసించిన ఈయన గాత్ర సంగీతంలో అపారమైన కృషి చేసి ఎవరికీ అందనంత ఎత్తుకు ఎదిగారు. అనేక ప్రభుత్వ కళాశాలలు, యూనివర్సిటీల్లో ఆచార్యులుగా పనిచేశారు. దేశ విదేశాల్లో వేల మంది శిష్యులున్నారు. వివిధ రాగాలు పాడటంలో ఆయన దిట్ట. చినసత్యనారాయణతో కలిసి సంగీత కచేరీల్లో పాల్గొంటే ఎంతో జ్ఞానం సంపాదించుకోవచ్చని పక్కవాద్య విద్వాంసుల అభిప్రాయం. అనేక విశ్వవిద్యాలయాలు ఆయనకు డాక్టరేట్లు అందజేసి సమున్నతంగా గౌరవించాయి.
డాక్టర్‌ నూకల చినసత్యనారాయణతో అనుబంధం ఉన్న తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర సంగీత, నృత్య కళాశాలలో ఈ సందర్భంగా సంతాపసభ నిర్వహించారు. కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు ఆయన సేవలను గుర్తు చేసుకుని నివాళి అర్పించారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.