జూలై 24వ తేదీన ”ఆంధ్రజ్యోతి” దినపత్రిక నందు ప్రచురించిన ‘హుండీలో హ్యాండు’, టీటీడీ నిధులకు సర్కారు టెండర్‌’ అనే వార్త‌కు వివరణ

జూలై 24వ తేదీన ”ఆంధ్రజ్యోతి” దినపత్రిక నందు ప్రచురించిన ‘హుండీలో హ్యాండు’, టీటీడీ నిధులకు సర్కారు టెండర్‌’ అనే వార్త‌కు వివరణ

జూలై 24వ తేదీన ”ఆంధ్రజ్యోతి” దినపత్రిక నందు ప్రచురించిన ‘హుండీలో హ్యాండు’, టీటీడీ నిధులకు సర్కారు టెండర్‌’ అనే శీర్షికతో ప్రచురించిన వార్త వాస్తవ దూరం.

తిరుమల తిరుపతి దేవస్థానం నిధులను రాష్ట్ర ప్రభుత్వ బాండ్లలో గానీ, ప్రయివేటు బ్యాంకుల్లో గానీ పెట్టుబడి పెట్టాలని తితిదే ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదు. ఈ విషయంపై పాలకమండలి సమావేశంలో చర్చ మాత్రమే జరిగింది. దేశంలోని ప్రముఖ ఆర్థికరంగ నిపుణులతో ఒక కమిటీ ఏర్పాటుచేసి వారి సలహాలు స్వీకరించిన పిమ్మట ఈ అంశంపై ఒక నిర్ణయానికి రావాల్సి ఉంటుంది. అసలు కమిటీనే ఏర్పాటుచేయలేదు. అందులోని నిపుణులు సలహాలూ ఇవ్వలేదు. అప్పుడే రాష్ట్ర ప్రభుత్వానికి తితిదే నిధులిస్తోందని ఊహాజనిత వార్త రాయడం శోచనీయం.

         భారత ప్రభుత్వ నిర్వహణలోని ప్రభుత్వ ఆర్థిక సంస్థ అయిన ఐడిబిఐ లాంటి బ్యాంకులో డిపాజిట్‌ చేయడానికి కూడా తితిదే ఆర్థిక నిపుణుల నుండి తగు మార్గదర్శకత్వాలు కోరాలని భావించింది. అన్య బ్యాంకుల్లో డిపాజిట్లు చేసేందుకు సలహాలు, సూచనలు కావాలని కోరినప్పుడు రాష్ట్ర ప్రభుత్వ బాండ్లలో పెట్టుబడి పెట్టాలన్న ఆలోచనే ఉత్పన్నం కాలేదు. ఈ విషయంపై ఆర్థిక నిపుణుల నుండి సూచనలు, సలహాలు మాత్రమే తీసుకోవాలని తితిదే పాలకమండలి భావించింది. పెట్టుబడులపై పాలకమండలి ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదు. యథాతథంగా ఇప్పుడున్న విధానమే అమలవుతుంది. భారత జాతీయ బ్యాంకుల్లో మాత్రమే పెట్టుబడులు కొనసాగుతాయి. నిబంధనలకు విరుద్ధంగా, భక్తుల మనోభావాలకు వ్యతిరేకంగా  తితిదే ఎలాంటి నిర్ణయాలూ తీసుకోదని ఈ సందర్భంగా తెలియజేయడమైనది.

కనుక పైతెల్పిన వాస్తవాల్ని రేపటి మీ దినపత్రికనందు వివరణగా ప్రచురించాల్సినదిగా కోరడమైనది.

ప్రజాసంబంధాల అధికారి
తిరుమల తిరుపతి దేవస్థానములు, తిరుపతి