వైభవంగా శ్రీ వీరభద్రస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు

వైభవంగా శ్రీ వీరభద్రస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు

తిరుపతి, 2012 జూలై 24: తిరుమల తిరుపతి దేవస్థానములకు అనుబంధంగా ఉన్న నారాయణవనంలోని శ్రీ వీరభద్రస్వామివారి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. జూలై 23వ తేదీన ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు ఆగస్టు ఒకటో తేదీ వరకు జరుగనున్నాయి.

సోమవారం సూర్యప్రభ వాహనంపై దర్శనమిచ్చిన శ్రీ వీరభద్రస్వామివారు మంగళవారం చంద్రప్రభ వాహనంపై భక్తులకు అభయమిచ్చారు. జూలై 25వ తేదీన భూత వాహనం, జూలై 26న సింహ వాహనం, జూలై 27న పులి వాహనం, జూలై 28న గజ వాహనాలపై స్వామివారు విహరించనున్నారు. జూలై 29వ తేదీన స్వామివారికి రథోత్సవం కన్నులపండువగా జరుగనుంది. అదే రోజు శ్రీ వీరభద్రస్వామివారికి, శ్రీ భద్రకాళి అమ్మవారికి కళ్యాణోత్సవం వైభవంగా నిర్వహించ నున్నారు. గృహస్త భక్తులు(ఇద్దరు) రూ.300/- చెల్లించి కళ్యాణోత్సవంలో పాల్గొనవచ్చు. గృహస్తులకు ఒక ఉత్తరీయం, ఒక రవికె, ప్రసాదాలను బహుమానంగా అందజేస్తారు.

అనంతరం జూలై 30వ తేదీన అశ్వ వాహనం, జూలై 31న ధ్వజావరోహణం, ఆగస్టు ఒకటో తేదీన ఖడ్గ ఉత్సవం వైభవంగా జరుగనున్నాయి. ఈ సందర్భంగా తితిదే హిందూ ధర్మప్రచార పరిషత్‌ ఆధ్వర్యంలో సాయంత్రం 3.00 గంటల నుండి 5.00 గంటల వరకు హరికథలు, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో సాయంత్రం 5.00 గంటల నుండి 7.00 గంటల వరకు ఆధ్యాత్మిక భక్తి సంగీత కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.