తిరుమలలో భక్తులు దళారులను నమ్మి మోసపోకండి : తితిదే సీవీఎస్వో శ్రీ జివిజి.అశోక్‌కుమార్‌

తిరుమలలో భక్తులు దళారులను నమ్మి మోసపోకండి : తితిదే సీవీఎస్వో శ్రీ జివిజి.అశోక్‌కుమార్‌

తిరుమల, 2012 అక్టోబరు 5: ప్రపంచ ప్రఖాతి చెందిన ధార్మిక క్షేత్రమైన తిరుమల శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులు దళారులను నమ్మి మోసపోవద్దని తితిదే ముఖ్య నిఘా మరియు భద్రతాధికారి శ్రీ జివిజి.అశోక్‌కుమార్‌ ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. శ్రీవారి విఐపి బ్రేక్‌ దర్శనం టికెట్లు, ఆర్జిత సేవా టికెట్ల విషయంలో దళారుల బారినపడి మోసపోతున్నట్టు ఇటీవల కాలంలో భక్తుల నుండి తితిదే నిఘా మరియు భద్రతా విభాగానికి పలు ఫిర్యాదులు అందుతున్నాయని తెలిపారు. హైదరాబాదుకు చెందిన భక్తుల నుండి సెప్టెంబరు 24వ తేదీన ఇలాంటి ఫిర్యాదు అందినట్టు వెల్లడించారు.

ఆ ఫిర్యాదు వివరాలు పరిశీలిస్తే తిరుమల వైకుంఠం క్యూకాంప్లెక్స్‌-2లో కౌంటర్‌ బాయ్‌గా పనిచేస్తున్న ముని నిరంజన్‌ తనను తితిదే ఉద్యోగిగా భక్తులకు పరిచయం చేసుకుని శ్రీవారి కళ్యాణోత్సవం టికెట్లు ఇప్పిస్తానని నమ్మబలికాడు. ఇందుకోసం రూ.10,800/- నగదు మొత్తాన్ని తిరుమల ఆంధ్రా బ్యాంకు అకౌంట్‌లో జమ చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు హైదరాబాద్‌కు చెందిన సదరు భక్తులు ఆ మొత్తాన్ని ముని నిరంజన్‌ అకౌంట్‌లో జమ చేశారు. అనంతరం ఫోన్‌లో సంప్రదించగా అతడు స్పందించలేదు. మోసపోయామని గుర్తించిన బాధితులు టోల్‌ఫ్రీ నంబరులో తితిదే నిఘా విభాగానికి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు తితిదే ఏవీఎస్వో శ్రీ కాటంరాజు తిరుమల 2 టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. స్పందించిన 2 టౌన్‌ ఎస్‌ఐ త్వరితగతిన విచారణ జరిపి అక్టోబరు 4వ తేదీన నిందితుడు ముని నిరంజన్‌ను అరెస్టు జ్యుడిషియల్‌ రిమాండ్‌కు తరలించారు.

ఈ నేపథ్యంలో భక్తులు స్వామివారి బ్రేక్‌ దర్శనం, సేవా టికెట్ల కోసం మధ్యవర్తులను, దళారులను నమ్మవద్దని తితిదే సీవీఎస్వో విజ్ఞప్తి చేస్తున్నారు. నిర్దేశించిన ప్రకారమే ఈ టికెట్లు పొందాలని కోరుతున్నారు. ఎవరైనా దళారులు నమ్మించాలని ప్రయత్నిస్తే భక్తులు కింది ఫోన్‌ నంబర్లకు ఫోన్‌ చేసి ఫిర్యాదు చేయవచ్చని తెలియజేశారు. ఫోన్‌ నంబర్ల వివరాలు కింది విధంగా ఉన్నాయి.

విజిలెన్స్‌ టోల్‌ ఫ్రీ నంబరు – 18004254141
విజిలెన్స్‌ అండ్‌ సెక్యూరిటీ అఫీసర్‌, తిరుమల – 9849575955
అసిస్టెంట్‌ విజిలెన్స్‌ అండ్‌ సెక్యూరిటీ ఆఫీసర్‌, తిరుమల – 9949828995

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.