JEO TML FELICITATES RETIRED EMPLOYEES IN TIRUMALA _ వైకుంఠం -1, 2 సిబ్బంది పనితీరు భేష్‌ తిరుమల జెఈవో కితాబు

JEO Sri K.S.Sreenivasa Raju felicitated Sri M. Mohan Krishna, AEO (VQC),Sr P.Nityanandam,  Jr Asst and Sri M.Subramanyam, Duffedar at  Tirumala on Friday evening.
 
DyEO Sri Chinnamagari Ramana and others were present on the occassion.
వైకుంఠం -1, 2 సిబ్బంది పనితీరు భేష్‌ తిరుమల జెఈవో కితాబు

తిరుమల, మే 31, 2013  : తిరుమల శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులకు వైకుంఠం -1, 2 క్యూ కాంప్లెక్సుల్లో రాత్రనకా, పగలనకా అకుంఠిత దీక్షతో సేవలందిస్తున్న సిబ్బంది పనితీరు భేషుగ్గా ఉందని తితిదే తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు ప్రశంసించారు. వైకుంఠం ఏఈవోగా విధులు చక్కగా నిర్వహించి పదవీ విరమణ పొందిన శ్రీ మోహనకృష్ణ, జూనియర్‌ అసిస్టెంట్‌ శ్రీ నిత్యానందం, శ్రీవారి ఆలయ దఫేదార్‌ శ్రీ సుబ్రమణ్యంను శుక్రవారం సాయంత్రం వైకుంఠం-1లో ఏర్పాటుచేసిన ప్రత్యేక కార్యక్రమంలో తిరుమల జెఈవో సన్మానించారు.
ఈ సందర్భంగా జెఈవో మాట్లాడుతూ ఇటీవల కాలంలో వైకుంఠం -1, 2లలో విధులు నిర్వహించే సిబ్బంది పనితీరు ప్రశంసలు అందుకుంటున్నట్టు తెలిపారు. భక్తుల సౌకర్యార్థం తమకు కేటాయించిన సమయం కన్నా ఎక్కువ సమయం సిబ్బంది పని చేస్తున్నారని కితాబిచ్చారు. ఇదే పనితీరును కనబరిచిన ఏఈవో శ్రీ మోహనకృష్ణను ఆయన అభినందించారు. పదవీ విరమణ పొందిన సిబ్బందికి, వారి కుటుంబ సభ్యులకు స్వామివారి కృపాకటాక్షాలు లభించాలని ఆకాంక్షించారు. శ్రీవారి సన్నిధానంలో పనిచేసే అవకాశం రావడం పూర్వజన్మ సుకృతమని, ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. శ్రీవారి దృష్టి ఈవో అయినా, జెఈవో అయినా, అటెండరు అయినా, దఫేదార్‌ అయినా అందరిపై సమానంగా ఉంటుందన్నారు. నిస్వార్థంగా విధులు నిర్వహించే సిబ్బందిపై స్వామివారి కృపాకటాక్షాలు ఎప్పుడూ ఉంటాయన్నారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన శ్రీవారి ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ చిన్నంగారి రమణ మాట్లాడుతూ ప్రపంచంలోనే అతిపెద్ద ధార్మిక సంస్థ అయిన తిరుమల తిరుపతి దేవస్థానంలో విధులు నిర్వహించడం సిబ్బందికి ఎప్పుడూ సవాలేనన్నారు. నిత్యం వేలాది మంది భక్తులు విచ్చేసే పుణ్యక్షేత్రంలో ప్రతి ఒక్కరినీ సంతృప్తిపరచడం అసాధ్యమన్నారు. ఉన్నతాధికారుల ప్రోత్సాహంతో సిబ్బంది అహర్నిశలు శ్రమిస్తూ చక్కగా విధులు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. అనంతరం విశ్రాంత సిబ్బందికి జెఈవో చేతులమీదుగా ఘనంగా సన్మానం జరిగింది. ఈ కార్యక్రమంలో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌ సిబ్బంది పాల్గొన్నారు.
              
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.