SRI KAPILESWARA SWAMY BRAHMOTSAVAM BEGINS _ ధ్వజారోహణంతో వేడుకగా శ్రీ కపిలేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం

Tirupati, 01 March 2024: The annual Brahmotsavams of Sri Kapileswara Swamy in Tirupati began on a grand religious note on Friday morning with the hoisting of Nandi Dhwajapatam on the temple pillar.

The event was carried out at the auspicious Meena Lagnam at 7.40 am in the presence of Panchamurthies, Sri Somaskandhamurthy, Sri Kamakshi Ammavaru, Sri Vinayaka Swami, Sri Chandikeswaraswamy, Sri Valli, Devasena sahita Sri Subramanya Swamy.

The program was scientifically conducted under the guidance of Kankanabhattar Sri Manivasan Gurukul.

Temple DyEO Sri Devendra Babu, AEO Sri Subba Raju, Superintendent Sri Bhupati and others were present.

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI

ధ్వజారోహణంతో వేడుకగా శ్రీ కపిలేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం
 
మార్చి 01, తిరుపతి, 2024: తిరుపతిలోని శ్రీకపిలేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు శుక్రవారం ఉదయం ధ్వజారోహణంతో వైభవంగా ప్రారంభమయ్యాయి.
 
అర్చకుల వేదమంత్రోచ్ఛారణ, శంఖనాదాలు, శివనామస్మరణ మధ్య ధ్వజారోహణ ఘట్టం శాస్త్రోక్తంగా జరిగింది. పంచమూర్తులైన శ్రీ సోమస్కంధమూర్తి, శ్రీ కామాక్షి అమ్మవారు, శ్రీ వినాయక స్వామి, శ్రీ చండికేశ్వరస్వామి, శ్రీ వల్లి, దేవసేన సమేత శ్రీ సుబ్రమణ్యస్వామివారి ఉత్సవమూర్తుల సమక్షంలో ఉదయం 7.40 గంటలకు మీన లగ్నంలో నంది చిత్రంతో కూడిన వస్త్రాన్ని ధ్వజపటానికి చుట్టి ధ్వజస్తంభంపైకి అధిరోహింపచేశారు. కంకణభట్టర్‌ శ్రీ మణివాసన్ గురుకుల్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం శాస్త్రోక్తంగా జరిగింది.
 
ఏడాదికోసారి ధ్వజస్తంభానికి  విశేష అభిషేకం…
 
ధ్వజారోహణంలో భాగంగా మొదట ధ్వజపటం అధిరోహణ, ఆ తరువాత ధ్వజస్తంభానికి అభిషేకం, బలి, నివేదన, దీపారాధన, ఉపచారాలు నిర్వహించారు. ఏడాదికోసారి బ్రహ్మోత్సవాల సందర్భంగా ధ్వజారోహణం రోజున మాత్రమే ధ్వజస్తంభానికి విశేషంగా అభిషేకం చేస్తారు. పెరుగు, చందనం, విభూది, పన్నీరు, పలురకాల పండ్లరసాలతో వేడుకగా ధ్వజస్తంభానికి అభిషేకం జరిగింది. దీపారాధనలో భాగంగా రథహారతి, నక్షత్రహారతి, సద్యజాతాది దీపారాధన, కుంభహారతి నిర్వహించారు. ఆ తరువాత ఛత్రం, చామరాలు, అద్దం, సూర్యచంద్రులు, విసనకర్ర, ధ్వజంతో ఉపచారాలు చేశారు. అదేవిధంగా రుగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణవేదాల్లోని మంత్రాలను పఠించారు.
 
ఈ సందర్భంగా ఆలయ ప్రధానార్చకులు, కంకణభట్టర్ శ్రీ మణివాసన్ గురుకుల్ మీడియాతో మాట్లాడుతూ బ్రహ్మోత్సవాల్లో భాగంగా 10 రోజులపాటు ఉదయం 7 నుండి 9 గంటల వరకు, రాత్రి 7 నుండి 9 గంటల వరకు వాహనసేవలు జరుగుతాయని తెలిపారు. మార్చి 8న శివరాత్రి పర్వదినం విశేషంగా జరుగనుందని చెప్పారు. మార్చి 9న కల్యాణోత్సవం, మార్చి 10న త్రిశూల స్నానం, ధ్వజావరోహణం జరుగనున్నాయని, భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేసి స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు.
 
అనంతరం శ్రీ సోమస్కందమూర్తి(శివుడు, పార్వతి, సుబ్రహ్మణ్యస్వామి), శ్రీ కామాక్షి అమ్మవారికి పల్లకీ ఉత్సవం నిర్వహించారు. పల్లకీపై స్వామి, అమ్మవారు తిరుపతి పురవీధుల్లో విహరించి భక్తులను అనుగ్రహించారు. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించారు.
 
ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ జి.దేవేంద్ర బాబు, ఏఈవో శ్రీ సుబ్బరాజు, సూపరింటెండెంట్‌ శ్రీ భూపతి, అర్చకులు శ్రీ స్వామినాథ గురుకుల్, శ్రీ ఉదయ గురుకుల్, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్లు శ్రీ రవికుమార్, శ్రీ బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
 
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.