భక్తుల రక్షణ బాధ్యత భద్రతా సిబ్బందిదే : సివిఎస్‌వో

భక్తుల రక్షణ బాధ్యత భద్రతా సిబ్బందిదే : సివిఎస్‌వో

తిరుపతి, ఏప్రిల్‌ 04, 2013: తిరుమల శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత భద్రతా సిబ్బందిదేనని తితిదే ముఖ్య నిఘా మరియు భద్రతా సిబ్బంది శ్రీ జివిజి.అశోక్‌కుమార్‌ పేర్కొన్నారు. తిరుపతిలోని శ్వేత భవనంలో ఆరో బ్యాచ్‌ తితిదే నిఘా, భద్రతా సిబ్బందికి నాలుగు రోజుల పాటు జరిగిన శిక్షణ తరగతులు గురువారం ముగిశాయి.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన శ్రీ జివిజి.అశోక్‌కుమార్‌ మాట్లాడుతూ  వేసవిలో భక్తుల రద్దీ పెరగనున్న దృష్ట్యా భద్రతా సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించి దొంగతనాలు జరగకుండా నివారించాలని సూచించారు. ఏ సంస్థకైనా భద్రతా సిబ్బంది కీలకమని, వారు సమర్థవంతంగా పని చేసినప్పుడే సక్రమంగా నడిచి మంచి ఫలితాలు సాధిస్తుందని అన్నారు. భక్తులకు మెరుగైన భద్రత కల్పించేందుకు సిబ్బంది నుండి సూచనలు, సలహాలు స్వీకరించారు. శిక్షణ తరగతుల్లో నేర్చుకున్న అంశాలను రోజువారీ విధుల్లో ఆచరణలో పెట్టాలని, అప్పుడే సత్ఫలితాలు వస్తాయని ఆయన తెలిపారు.

ఈ కార్యక్రమంలో శ్వేత సంచాలకులు డాక్టర్‌ కె.వి.రామకృష్ణ, రిటైర్డ్‌ డీఎస్పీ శ్రీ నారాయణస్వామి, ఎవిఎస్‌వో శ్రీనివాసులు, 55 మంది భద్రతా సిబ్బంది పాల్గొన్నారు.

ఆధునిక పరిజ్ఞానంతో విద్యుత్‌ బిల్లులు తగ్గించాలి  : సివిఎస్‌వో

తితిదేలోని ఎలక్ట్రికల్‌ ఇంజినీర్లు ఆధునిక పరిజ్ఞానాన్ని అవగాహన చేసుకుని విద్యుత్‌ బిల్లులు తగ్గించేందుకు కృషి చేయాలని తితిదే ముఖ్య నిఘా మరియు భద్రతాధికారి శ్రీ జివిజి.అశోక్‌కుమార్‌ సూచించారు. తిరుపతిలోని శ్వేత భవనంలో ఎలక్ట్రికల్‌ ఇంజినీర్లకు రెండు రోజుల పాటు నిర్వహించిన శిక్షణ తరగతులు గురువారం ముగిశాయి.
ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన శ్రీ జివిజి.అశోక్‌కుమార్‌ మాట్లాడుతూ ఏ వృత్తిలో ఉన్నవారికైనా తరచూ శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడం చాలా ముఖ్యమన్నారు. ఎలక్ట్రికల్‌ ఇంజినీర్లు తమ రంగంలోని కొత్త కొత్త పద్ధతులను అవగాహన చేసుకుని వృత్తిపరమైన నైపుణ్యం పెంచుకోవాలన్నారు. అనంతరం శిక్షణ తరగతుల్లో పాల్గొన్న 38 మంది ఇంజినీర్లకు ధ్రువపత్రాలు ప్రదానం చేశారు.

ఈ కార్యక్రమంలో ఎలక్ట్రికల్స్‌ సూపరింటెండెంట్‌ ఇంజినీర్‌ శ్రీ ఎ.వెంకటేశ్వర్లు, శ్వేత సంచాలకులు డాక్టర్‌ కె.వి.రామకృష్ణ, ఇతర అధికారులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.