మే 24 నుండి 26వ తేదీ వరకు అన్నమయ్య 605వ జయంతి ఉత్సవాలు

మే 24 నుండి 26వ తేదీ వరకు అన్నమయ్య 605వ జయంతి ఉత్సవాలు

తిరుపతి, మే 4, 2013: తన సంకీర్తనలతో కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీవారి వైభవాన్ని విశ్వవ్యాప్తం చేసిన శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 605వ జయంతి ఉత్సవాలను మే 24 నుండి 26వ తేదీ వరకు తితిదే ఘనంగా నిర్వహించనుంది. ఇందులో భాగంగా కడప జిల్లా తాళ్లపాక గ్రామం, తాళ్లపాకలోని 108 అడుగుల అన్నమయ్య విగ్రహం, తిరుపతిలోని మహతి కళాక్షేత్రం, అన్నమాచార్య కళామందిరం, తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం, తిరుమలలోని నాదనీరాజన మండపంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

తాళ్లపాకలో మే 24వ తేదీ ఉదయం 10.30 గంటల నుండి మధ్యాహ్నం 1.00 గంట వరకు శ్రీనివాస కల్యాణం వైభవంగా నిర్వహించనున్నారు. మే 26వ తేదీ వరకు సాయంత్రం వేళ సాంస్కృతిక కార్యక్రమాలు జరుగనున్నాయి. తాళ్లపాకలోని 108 అడుగుల అన్నమయ్య విగ్రహం వద్ద మే 24న సాయంత్రం 6.00 నుండి 7.00 గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఉత్సవమూర్తులకు ఊంజల్‌ సేవ జరుగనుంది. అనంతరం రాత్రి 9.00 గంటల వరకు సంకీర్తనల ఆలాపన, హరికథ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. మే 26వ తేదీ వరకు సాయంత్రం వేళ సాంస్కృతిక కార్యక్రమాలు జరుగనున్నాయి.

మే 24వ తేదీన తిరుమలలోని నాదనీరాజన వేదికపై ప్రముఖ సంగీత విద్వాంసులతో సంగీత కార్యక్రమం నిర్వహించనున్నారు.

అదేవిధంగా మే 25, 26వ తేదీల్లో తిరుపతిలోని మహతి కళాక్షేత్రం, అన్నమాచార్య కళామందిరం, తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం ఆస్థానమండపంలో సాయంత్రం వేళ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

తి.తి.దే ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.