రిషికేష్‌లో మే 22 నుండి శ్రీ వేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు

రిషికేష్‌లో మే 22 నుండి శ్రీ వేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు

తిరుపతి, ఏప్రిల్‌  22, 2013: రిషికేష్‌లోని తితిదే ఆంధ్ర ఆశ్రమంలో కొలువైన శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు మే 22 నుండి 30వ తేదీ వరకు వైభవంగా జరుగనున్నాయి. మే 21వ తేదీన అంకురార్పణంతో ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి.

మే 22వ తేదీ ఉదయం 9.15 నుండి 9.30 గంటల మధ్య కర్కాటక లగ్నంలో ధ్వజారోహణం జరుగనుంది. బ్రహ్మోత్సవాల్లో ఎనిమిదో రోజైన మే 28న స్వామి, అమ్మవార్ల కల్యాణోత్సవం నిర్వహించనున్నారు. మే 29న ఉదయం 7.25 గంటలకు రథోత్సవం వైభవంగా జరుగనుంది. అలాగే ఏప్రిల్‌ 30వ తేదీన ఉదయం 10.10 గంటలకు చక్రస్నానం నిర్వహించ నున్నారు.

బ్రహ్మోత్సవాల సందర్భంగా తితిదే హిందూ ధర్మప్రచార పరిషత్‌ ఆధ్వర్యంలో ప్రతిరోజూ స్థానిక పండితులతో ధార్మికోపన్యాసాలు నిర్వహించనున్నారు. అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు భక్తి సంగీత కార్యక్రమాలు నిర్వహిస్తారు. దాససాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో భజన బృందాలు, కోలాటం బృందాల సభ్యులు ఆడిపాడనున్నారు.

రిషికేష్‌ ఉత్తరాంచల్‌ రాష్ట్రంలోని తీర్థక్షేత్రం. హిమాలయ పర్వత మైదానంలో ఉన్న రిషికేష్‌లోని ఆంధ్ర ఆశ్రమంలో వేంకటేశ్వర ఆలయంతోపాటు వివిధ ఆలయాల సముదాయం ఉంది. ఇక్కడ ప్రతి సంవత్సరం వైశాఖ మాసంలో వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహిస్తారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.