విజయనామ సంవత్సరంలో అందరికీ శుభమే : జెఇఓ

విజయనామ సంవత్సరంలో అందరికీ శుభమే : జెఇఓ

తిరుపతి, ఏప్రిల్‌  11, 2013: తెలుగు వారి నూతన విజయనామ సంవత్సరంలో శ్రీవారి భక్తులకు, తితిదే ఉద్యోగులకు సకల శుభాలు కలగాలని తితిదే తిరుపతి సంయుక్త కార్యనిర్వహణాధికారి శ్రీ పి.వెంకట్రామిరెడ్డి ఆకాంక్షించారు. తితిదే హిందూ ధర్మప్రచార పరిషత్‌ ఆధ్వర్యంలో తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో గురువారం ఉగాది మహోత్సవం నిర్వహించారు.

ఈ సందర్భంగా తిరుపతి జెఈఓ శ్రీ పి.వెంకట్రామిరెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి తితిదే ఉద్యోగులకు, తిరుపతి నగరవాసులకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. ముందుగా డాక్టర్‌ వేదాంతం రాజగోపాల చక్రవర్తి పంచాంగ శ్రవణం చేశారు. పంచాంగ శ్రవణం హైందవులకు అనాదిగా వస్తున్న సంప్రదాయమన్నారు. దీనివల్ల సుఖ సంతోషాలు సిద్ధిస్తాయని, గోదానం చేసినంత ఫలితం దక్కుతుందని ఆయన తెలిపారు. బ్రహ్మదేవుడు సృష్టిని ప్రారంభించిన తొలిరోజును ఉగాది అంటారని పురాణాల్లో ఉందని ఆయన వివరించారు. కొత్త సంవత్సరంలో  సర్వలోక రక్షకుడైన శ్రీవారిని ప్రార్థిస్తూ నూతన ఉత్సాహంతో అడుగులు వేస్తే అన్నీ విజయాలే సిద్ధిస్తాయన్నారు. అనంతరం అందరికీ ఉగాది పచ్చడి, ప్రసాదం పంపిణీ చేశారు.

ఆ తరువాత నిర్వహించిన కవి సమ్మేళనం సభికులను ఆకట్టుకుంది. అన్నమాచార్య ప్రాజెక్టు సంచాలకులు డాక్టర్‌ మేడసాని మోహన్‌, ముఖ్య అంకణీయ అధికారి శ్రీ కొప్పరపు శేషశైలేంద్ర, సప్తగిరి ప్రధాన సంపాదకులు డాక్టర్‌ శైలకుమార్‌, ఉపసంపాదకులు డాక్టర్‌ కె.రవిచంద్రన్‌, ప్రముఖ పండితులు ముదివర్తి కొండమాచార్యలు, డాక్టర్‌ రామ్మూర్తి, గౌరిశంకర్‌, తితిదే ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ శ్రీ వెంకటేశ్వర్లు, శ్రీ కరణం బాలసుబ్రమణ్యం పిళ్లై, ఆచార్య కె.సర్వోత్తమరావు, శ్రీ ఉప్పలపాటి వెంకటరమణ కవి సమ్మేళనంలో పాల్గొన్నారు. వీరు విజయనామ సంవత్సరాన్ని ఆహ్వానిస్తూ, వరాలు ఇవ్వాలని కోరుతూ, సకలశుభాలు కలగాలని శ్రీవారిని ప్రార్థిస్తూ, ప్రకృతిని రక్షించాలని పిలుపునిస్తూ కవితలు చదివి వినిపించారు. హిందూ ధర్మప్రచార పరిషత్‌ ప్రత్యేకాధికారి శ్రీ ఎస్‌.రఘునాథ్‌ సమన్వయకర్తగా వ్యవహరించారు.

అనంతరం పంచాంగ శ్రవణం చేసిన డాక్టర్‌ వేదాంతం రాజగోపాల చక్రవర్తిని, కవిసమ్మేళనంలో పాల్గొన్నవారిని తితిదే జెఇఓ, సేవల విభాగం ఉప కార్యనిర్వహణాధికారి శ్రీ శివారెడ్డి కలసి శ్రీవారి ప్రసాదం, మెమెంటోలతో సన్మానించారు.

ఈ కార్యక్రమంలో హిందూ ధర్మప్రచార పరిషత్‌ ఉప కార్యనిర్వహణాధికారి శ్రీ ఉమాపతిరెడ్డి, ఇతర అధికారులు, పెద్ద సంఖ్యలో నగరవాసులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.