వివరణ _ ”శ్రీవారి దర్శనం… క్షణ భంగురం” అనే వార్తకు వివరణ

వివరణ

”శ్రీవారి దర్శనం… క్షణ భంగురం” అనే వార్తకు వివరణ

విషయం :- 17-3-09వ తేదిన ఆంధ్రజ్యోతి పత్రికలో ”శ్రీవారి దర్శనం… క్షణ భంగురం” అనే శీర్షికతో ప్రచురితమైనవార్తకు వివరణ.

మంగళవారంనాడు ఆంధ్రజ్యోతి దినపత్రికలో ”శ్రీవారి దర్శనం…. క్షణభంగురం” అనే శీర్షికతో ప్రచురితమైన వార్తాకథనం నిరాదారమైనది.

తిరుమల తిరుపతి దేవస్థానములు తిరుమలకు వచ్చే భక్తులందరికీ శ్రీవారి దర్శనం, మంచి వసతి, ఉచిత భోజన సౌకర్యాలు కల్పించడానికి నిరంతర కృషి సల్పుచున్నది. తి.తి.దే యాజమాన్యంతో పాటు కొన్ని తరాలుగా వేలాదిమంది ఉద్యోగులు భక్తులకు అవసరమైన సౌకర్యాలు కల్పించడానికి విశేషమైన కృషి సల్పినందువలననే దేవస్థానానికి అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతులు లభించాయి.

కాని ఆంధ్రజ్యోతి దినపత్రిక వార్తా కథనంలో తిరుమలలో అరాచకం ప్రబలిందని, 50 వేల మంది భక్తులకు కేవలం 11.30 గంటల దర్శన సమయం కేటాయిస్తుండగా, 10 నుండి 15 వేలమంది భక్తులకు మాత్రము 8.30 గంటల సమయం కేటాయిస్తున్నారని పేర్కొన్నారు. ఇది నిరాదారమైన ఆరోపణ్ష్మ పూర్తిగా సత్యదూరం.

తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య రోజురోజుకు పెరుగుచున్నది. ఉదాహరణకు 2003వ సంవత్సరం తిరుమలను సందర్శించిన భక్తులసంఖ్య 1.44 కోట్లు అయితే, అదే సంఖ్య 2008వ సంవత్సరంలో 2.30 కోట్లకు చేరింది. అంటే ప్రతిరోజు దాదాపు 63 వేలమంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. తిరుమలకు వచ్చిన భక్తులందరికీ శ్రీవారిదర్శనం కల్పించడానికే  ”మహాలఘు దర్శనం” ప్రవేశ పెట్టబడింది. భక్తుల సంఖ్య తక్కువగా ఉన్న రోజులలో లఘుదర్శనమే అమలులో యుంటుంది. గత ఐదేళ్ళలో భక్తుల సంఖ్య సంవత్సరానికి దాదాపు ఒక కోటి పెరిగింది. భక్తులు చెప్పుకోదగ్గగా పెరగలేదని పేర్కొనడం వాస్తవంకాదు.

అంతేగాకుండ, సర్వదర్శన సమయం 11.30 గంటలేనని పేర్కొనడంకూడా వాస్తవంకాదు. ఒక వారంలో సర్వదర్శన సమయం 13.00 గంటల నుండి 15.00 గంటల వరకు యుంటుంది. సోమ, మంగళవారాల్లో 15.00 గంటలు, బుధ,గురువారాల్లో 13.30 గంటలు, శుక్రవారంనాడు 13.00 గంటలు, శని, ఆదివారాల్లో 14.30 గంటల సమాయాన్ని సర్వదర్శనానికి కేటాయించడం జరుగుతుంది.. అదేవిధంగా వి.ఐ.పి లకు కేటాయించిన సమయం ఉదయం 45 నిమిషాలు, సాయంత్రం మరో 45 నిమిషాలు మాత్రమే. వి.ఐ.పి దర్శనానికి కేవలం 500 మందిని మాత్రమే అనుమతించడం జరుగుతుంది. వి.ఐ.పి దర్శనానికి రెండువేలమందిని అనుమతిస్తారని, దర్శనసమయాన్ని వారికి దాదాపు 8.30 గంటలు కేటాయిస్తారని పేర్కొనడం అవాస్తవం. ”మహాలఘు దర్శనం ప్రవేశపెట్టడం వలన గతంలో మాదిరిగా శ్రీవారి దర్శనం లభించక నిరాశతో వెనుతిరిగి పోయేవారి సంఖ్య పూర్తిగా తగ్గిపోయింది.

కొన్ని వందల సంవత్సరాలనుండి అర్చకులు తిరుమలలో శ్రీవారికి ఆగమశాస్త్ర నియమాల ప్రకారం సేవలు, కైంకర్యాలు నిర్వహిస్తున్నారు. శని, ఆది, సోమవారాలలో తోమాల, అర్చన సేవలు ఏకాంతంగా జరుగుతున్న సమయంలోకూడా భక్తులకు శ్రీవారి దర్శన సౌకర్యం యిటీవలనే ప్రవేశపెట్టడం జరిగింది. ఈ కార్యక్రమంపట్ల ఎంతోమంది భక్తులు తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. వీలైనంత వరకు ఎక్కువమంది భక్తులకు తక్కువ సమయంలో శ్రీవారి దర్శనం కల్పించడమే దేవస్థానం ప్రధాన ఉద్దేశం. తిరుమలలో శ్రీవారి సేవలను ఆదేవదేవుడే నిర్ణయించాడు.. వీటిని మార్పుచేయడానికి మానవుమాత్రులెవ్వరికి అధికారంలేదు. ఈ సేవలతోపాటు శ్రీవారికి నైవేద్యం, సాతుమొర, నిత్యహారతుల కార్యక్రమాలకు ప్రతిరోజు నాలుగు నుండి ఐదు గంటల వరకు సమయం అవసరమవుతుంది.  తిరుమలలో వ్యక్తులతో సంబంధంలేకుండా, అభివృద్ధి కార్యక్రమాలు నిరంతరం అమలు జరుగుతుంటాయి. తిరుమలలో మరో 15 వేలమందికి అదనపు వసతి సౌకర్యం కల్పించడానికి నిర్ధిష్టమైన కార్యక్రమాలు అమలు జరుగుచున్నాయి. ఉచితదర్శనం ద్వారా వేళ్ళే ప్రతి భక్తునికి ఒక లడ్డు ఉచితంగా, మరో లడ్డూను కేవలం రూ.5/-లకే సరఫరాచేయడం జరుగుచున్నది. తిరుమలలో భక్తులందరికీ ఉచితంగా భోజన వసతి కల్పించడం దేవస్థానం ప్రధానలక్ష్యం. అందులో భాగంగానే, అన్నదానం కాంప్లెక్సును విస్తరించడంతోపాటు యస్‌.వి.అతిథి గృహంలో కూడా ఉచితంగానే భక్తులకు భోజన వసతి కల్పించడం జరుగుచున్నది. వీటితోపాటు, అనేక ఇతర అభివృద్ధి తిరుమలలో అమలు జరుగుచున్నాయి.

ఈ వివరణను ఆంధ్రజ్యోతి పత్రికలో సవివరంగా ప్రచురించాలని మనవి చేయుచున్నాము.

కె.రామపుల్లారెడ్డి
తి.తి.దే, ముఖ్య ప్రజాసంబందాధికారి