వివరణ

”వెంకన్ననీ వదల్లేదు, దేవుని పాలనలో వెంకన్న వెతలు” అనే వార్తకు వివరణ

విషయం:-ఈ నెల 20వ తేదీన ఈనాడు దినపత్రికలో ”వెంకన్ననీ వదల్లేదు, దేవుని పాలనలో వెంకన్న వెతలు” అనే శీర్షికలతో ప్రచురించిన వార్తకు  వివరణ.

ఈనాడు దినపత్రికలో పైన పేర్కోన్న శీర్షికతో ప్రచురించిన వార్తా కథనం అవాస్తవం. ఈ వార్తా కథనం కోట్లాది భక్తులను అనవసరంగా ఆందోళనకు గురిచేసే విధంగా ఉంది. రాష్ట్రంలో యెంతోమంది పేదల జీవితాలలో వెలుగు నింపడానికి దేవస్థానము ప్రవేశపెట్టిన మహత్తర పథకమే కల్యాణమస్తు. ఈ కార్యక్రమము ద్వారా ఇంత వరకు రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 27 వేల జంటలు శ్రీవారి ఆశీస్సులతో దంపతులయ్యారు. నూతన వదువుకు బంగారు మంగళసూత్రం, వదూవరులకు నూతన వస్త్రాలు వారి బంధువులకు పెళ్ళి విందు అన్నీ ఉచితంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఒక్కోజంటకు దాదాపు రూ.ఆరువేల చొప్పున మొత్తం 27వేల జంటలకు 16 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. ఇందుకు అయిన ఖర్చు మొత్తాన్ని నిబంధనల ప్రకారమే ఖర్చు చేయడం జరిగినది. అంతే తప్ప ఏలాంటి ఆడిట్‌ లేదని పేర్కొనడం శోచనీయం. ఆదే విధంగా ప్లాస్మా టీవీలను కూడా దేవస్థానము నిబంధనల ప్రకారమే కొనుగోలు చేయడం జరిగినది. పదకవితాపితామహులు తాళ్ళపాక అన్నమాచార్యుల వారి జన్మస్థలం తాళ్ళపాక గ్రామాన్ని ప్రఖ్యాత ఆధ్యాత్మిక కేంద్రముగా రూపొందించాలని పాలకమండలి నిర్ణయించింది. అందులో భాగంగా, అన్నమయ్య 600వ జయంతికి మూడు కోట్ల యాభై లక్షల రూపాయల ఖర్చుతో 108 అడుగుల అన్నమయ్య విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగినది. ఇతర అభివృద్ధి కార్యక్రమాలు కూడా జరుగుచున్నాయి. ఈ బృహత్తర కార్యక్రమములో దేశ,విదేశాల నుండి లక్షలాది మంది భక్తులతో పాటు ప్రఖ్యాత సంగీత విద్వాంసులు, కళాకారులు, సాహితీ దిగ్గజాలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేయడం జరిగినది. ఈ మహత్తర కార్యక్రమంలో ఎలాంటి దుర్వినియోగం జరుగలేదు.

తిరుమల తిరుపతి దేవస్థానములో ఇంజనీరింగు పనులు చేపట్టడానికి నిర్ధిష్టమైన నిబంధనలు, వ్యవస్థ యున్నాయి. పనులను బట్టి, ఇంజనీరింగు పనులను ప్రీక్వాలిఫికేషన్‌, ‘ఈప్రొక్యూర్‌మెంటు’ పద్దతులలో వర్క్సు కమిటీ ద్వారా కేటాయించడం జరుగుతుంది. ఇందులో ఎలాంటి అవకతవకలకు అవకాశం లేదు. శ్రీవారి ప్రాభవాన్ని, ఆధ్యాత్మిక కార్యక్రమానికి విస్తృతంగా ప్రచారం కల్పించడానికి తితిదేవస్థానం శ్రీవేంకటేశ్వర భక్తిఛానల్‌ను ఏర్పాటు చేసింది. ఎస్‌.వి. ఛానల్‌ సిబ్బంది ఎంపిక, ఖర్చు కూడా నిబంధనల ప్రకారమే చేయడం జరుగుచున్నది.

శ్రీవారి లడ్డూ ప్రసాదం ధరను దేవస్థానం పెంచలేదు. అంతేగాకుండ, మొట్టమొదటి సారిగా ఉచిత దర్శనానికి వెళ్ళే ప్రతి భక్తునికి ఒక లడ్డు ఉచితంగా, మరో లడ్డూను కేవలం ఐదు రూపాయలకే పంపిణీ చేస్తోంది. ఇవిగాకుండ, రెకమెండేషన్‌ ఉత్తరాలపైన అదనంగా లడ్డూలు కావలసిన వారికే ఒక లడ్డూను రూ.25 లకు దేవస్థానం విక్రయిస్తోంది. మొత్తం లడ్డూ ప్రసాదం ధరను రూ.25 లకు దేవస్థానం పెంచిందని అర్థం స్పురించే విధంగా పేర్కొనడం పూర్తిగా అవాస్తవం. తిరుమలలో ”అన్యమత ప్రచారం” ”ఏడు కొండల వివాదం” పూర్తిగా అపోహలు. గతంలో యిలాంటి వార్తలను దేవస్థానం పలు మార్లు ఖండించింది.

కనుక ఈ వివరణను రేపటి మీ దినపత్రికనందు ప్రముఖంగా ప్రచురించాల్సిందిగా కోరడమైనది.

ముఖ్య ప్రజాసంబంధాల అధికారి
తిరుమల తిరుపతి దేవస్థానములు