వైభవంగా ముగిసిన శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి వసంతోత్సవాలు

వైభవంగా ముగిసిన శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి వసంతోత్సవాలు

తిరుపతి, మే 30, 2013: శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో మూడు రోజుల పాటు జరిగిన వసంతోత్సవాలు గురువారం ఘనంగా ముగిశాయి. ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి తోమాలసేవ, సహస్రనామార్చన నిర్వహించారు. ఉదయం 8.30 నుండి 9.00 గంటల వరకు శ్రీ భూ సమేత వేంకటేశ్వరస్వామి, సీతా రామ లక్ష్మణ ఆంజనేయ స్వామి, రుక్మిణి, సత్యభామ సమేత శ్రీకృష్ణుని ఉత్సవమూర్తులను వసంత మండపంలోకి వేంచేపు చేసి ఆస్థానం నిర్వహించారు.
 
మధ్యాహ్నం 2.00 నుండి 4.00 గంటల వరకు స్నపనతిరుమంజనం వైభవంగా జరిగింది. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, పలురకాల పండ్లరసాలతో అభిషేకం నిర్వహించారు. సాయంత్రం 6.00 నుండి 7.00 గంటల వరకు ఆలయం వెలుపల గల మండపంలో ఊంజల్‌ సేవ జరిగింది. రాత్రి 7.00 నుండి 8.00 గంటల వరకు తిరువీధి ఉత్సవం నిర్వహించారు. స్వామి, అమ్మవార్లు ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిచ్చారు.
 
ఈ కార్యక్రమంలో తితిదే స్థానిక ఆలయాల ఉప కార్యనిర్వహణాధికారి శ్రీమతి రెడ్డెమ్మ, సూపరింటెండెంట్లు శ్రీ కృష్ణారావు, శ్రీ దినకర్‌రాజు, ఇతర అధికారులు, అర్చకులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.