వైభవంగా శ్రీ గోవిందరాజస్వామివారి చక్రస్నానం

వైభవంగా శ్రీ గోవిందరాజస్వామివారి చక్రస్నానం

తిరుపతి, మే 25, 2013: తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన శనివారం చక్రస్నానం వైభవంగా జరిగింది. ముందుగా ఉదయం 5.30 నుండి 6.30 గంటల వరకు పల్లకీపై స్వామివారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించారు. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించారు. అనంతరం స్వామివారు ఊరేగింపుగా కపిలతీర్థంలోని ఆళ్వార్‌ తీర్థానికి చేరుకున్నారు. అక్కడ స్నపనతిరుమంజనం అనంతరం వైభవంగా చక్రస్నానం నిర్వహించారు. ఆ తరువాత తితిదే పరిపాలనా భవనం ఎదుట గల పి.ఆర్‌.తోటకు వేంచేశారు.
సాయంత్రం 5.00 గంటల నుండి 7.00 గంటల వరకు స్వామివారు పి.ఆర్‌.తోట నుండి ఊరేగింపుగా శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయానికి చేరుకోనున్నారు. రాత్రి 8.00 నుండి 9.00 గంటల వరకు శ్రీ గోవిందరాజుల వారు బంగారు తిరుచ్చిపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో భక్తులకు దర్శనమివ్వనున్నారు. రాత్రి 9.10 గంటల నుండి 9.30 గంటల వరకు ధ్వజావరోహణం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంతో శ్రీ గోవిందరాజస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. కాగా బ్రహ్మోత్సవాల సందర్భంగా తితిదే అన్నదానం విభాగం ఆధ్వర్యంలో తొమ్మిది రోజుల పాటు భక్తులకు మధ్యాహ్నం, సాయంత్రం వేళల్లో వాహన సేవల సమయంలో ఉచితంగా మజ్జిగ, అన్నప్రసాదాలను వేలాది మందికి పంపిణీ చేశారు. అదేవిధంగా అన్నమయ్య జయంతి సందర్భంగా తాళ్లపాకలో పెద్ద ఎత్తున భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు.
ఈ కార్యక్రమంలో తితిదే స్థానిక ఆలయాల ఉపకార్యనిర్వహణాధికారి శ్రీ చంథ్రేఖరపిళ్లై, ఏఈవో శ్రీ ప్రసాదమూర్తిరాజు, ఇతర అధికార ప్రముఖులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.